అస్సాంలో తాము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ ‘గృహిణి సమ్మాన్’ పథకం కింద నెలకు 2 వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. అలాగే ప్రతినెలా 200 రూపాయల విలువైన విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని కూడా అన్నారు. తేయాకు తోటల్లో పని చేసే మహిళలకు రోజుకు 365 రూపాయలు ఇస్తామని, రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆమె అన్నారు. తేజ్ పూర్ లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆమె.. ఇవి కేవలం హామీలు కావని, తాను ఇస్తున్న గ్యారంటీ అని పేర్కొన్నారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని కూడా ప్రియాంక అన్నారు. ఇప్పటికే సీఏఎకి నిరసనగా ఇక్కడ కొన్ని నెలలపాటు జరిగిన ఆందోళనలను ఆమె గుర్తు చేశారు. కేంద్రం మళ్ళీ ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని చెబుతోందని, కానీ అస్సాం వాసులు దీన్ని ఒప్పుకోరని ఆమె చెప్పారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని లోగడ హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
కాగా- ఈ ఉదయం బిశ్వనాథ్ జిల్లాల్లో టీ తోటల్లో పని చేసే మహిళలను తను కలిశానని, వారి కార్మిక శక్తి ఈ దేశానికి ఎంతో విలువైనదని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. వారితో కలిసి తాను పని చేసినప్పుడు వారి సమస్యలు తెలుసుకోగలిగానని ఆమె పేర్కొన్నారు. ఈమె అస్సాం రెండు రోజుల పర్యటన నేటితో ముగిసింది. కాగా-అస్సాంలో ప్రియాంక గాంధీ ఒక్కరే సుడిగాలి పర్యటనలు చేయడం విశేషం. అస్సాంలో మార్చి 27 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 12 జిల్లాల్లోని 57 స్థానాలకు, అనంతరం ఏప్రిల్ 1 న 13 జిల్లాల్లోని 39 సీట్లకు, ఏప్రిల్ 6 న 12 జిల్లాల్లోని 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :
తేయాకు కార్మికురాలిగా మారిన కాంగ్రెస్ నేత ప్రియాంక వైరల్ అవుతున్న ఫొటోస్ : Congress Priyanka Photos.