వ్యవసాయ చట్టాలపై సంక్షోభ పరిష్కారానికి కేంద్రం రెడీగా ఉందని, రైతు సంఘాలు దీనిపై ఆలోచించి మళ్ళీ చర్చలకు రావచ్చునని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, వారి డిమాండ్ల పరిశీలనకు తాము సిధ్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. గ్వాలియర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చర్చలకు అంగీకరించి ఓ సానుకూల పరిష్కారానికి వస్తే అన్నదాతల ఆందోళనకు స్వస్తి చెప్పవచ్చునని అన్నారు. రైతు సంఘాలతో సుమారు 11 దఫాలుగా చర్చలు జరిగాయని, తాము సూచించిన సవరణలను వారు అంగీకరించలేదని తోమర్ చెప్పారు. ప్రధాని మోదీ సైతం వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని, వారి నిరసనకు ఇక ముగింపు పలకాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. అయితే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ బోర్డర్లో అన్నదాతలు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ వారు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హర్యానా, పంజాబ్, యూపీ రాష్ట్రాలకు చెందిన రైతులు ఇప్పటికీ ఇక్కడ టెంట్లలో ప్రొటెస్ట్ కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఆందోళన అక్టోబరు 2 వరకు, ఆ తరువాత కూడా కొనసాగుతుందని బీకేయు నేత రాకేష్ సింగ్ తికాయత్ ఇదివరకే ప్రకటించారు.
పంట కోతల కాలం గనుక ప్రస్తుతానికి రైతులు తమతమ గ్రామాలకు వెళ్లారని, తాము ఎప్పుడు కోరితే అప్పుడు వారంతా మళ్లీ తిరిగివస్తారని ఆయన చెప్పారు. సుమారు 40 లక్షల ట్రాక్టర్లతో తాము పార్లమెంటును ముట్టడిస్తామని, అక్కడ పంటలు పండిస్తామని కూడా ఆయన అన్నారు. తమ ఆందోళనకు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర కు చెందిన అన్నదాతలు కూడా మద్దతునిస్తున్నారని ఆయన పేర్కొన్నారు . కాగా తోమర్ చేసిన తాజా ప్రకటనపై రైతు సంఘాలు ఇంకా స్పందించాల్సి ఉన్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ:టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.
బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video.