Viral Video: దారుణం.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన RPF అధికారి! ఏకిపారేస్తున్న నెటిజన్లు..

రైల్వే ప్రయాణికుల పట్ల కొందరు రైల్వే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇందుకు సంబంధించిన పలు సంఘటనలు ఇప్పటికే వార్తల్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి ఒకరు లగేజీతో రైలెక్కిన ఓ ప్రయాణికుడి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కదులుతున్న రైలు నుంచి బలవంతంగా బయటకు నెడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సదరు అధికారి ఓ యువకుడిని చెంపదెబ్బలు కొడుతూ, కదులుతున్న రైలు డోర్‌ నుంచి బలవంతంగా తోస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అదే ట్రైన్‌లోని తోటి ప్రయాణీకులు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా వీడియోలో చూడొచ్చు. అసలేం జరిగిందంటే..

Viral Video: దారుణం.. కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన RPF అధికారి! ఏకిపారేస్తున్న నెటిజన్లు..
RPF officer pushed passenger out of train

Updated on: Aug 21, 2025 | 5:39 PM

ఎక్స్‌ ఖాతాలో షేర్ చేయబడిన ఈ మీడియోలో.. ఓ యువకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ అధికారి గుర్తించారు. అయితే ప్రయాణికుడికి జరిమానా విధించడం లేదంటే తదుపరి స్టేషన్‌లో అతన్ని రైలు నుంచి దించేయడం వంటివి చేయాలి. వీటికి బదులుగా ఆ అధికారి అతన్ని రైలు నుంచి బలవంతంగా బయటకు తోసెయ్యడం వీడియోలో కనిపిస్తుంది. అదే ట్రైన్‌లో ఉన్న ఇతర ప్రయాణీకులు ఆ అధికారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైగా అడిగిన వారిపై కూడా ఆర్‌పీఎఫ్‌ అధికారి కన్నెర్ర చేయడం వీడియోలో చూడొచ్చు. దీంతో ఓ ప్రయాణికుడు రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

టికెట్ లేకుండా ఆ యువకుడు ప్రయాణిస్తుంటే, అతనికి జరిమానా విధించాలి. లేదా తదుపరి స్టేషన్‌లో అతన్ని దించేయాలి. అంతేకానీ అతన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేయడం ఏంటి? యూనిఫాం ధరించడం వల్ల మీరు దేవుడిగా మారారా? అంటూ ఓ యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సదరు RPF అధికారిపై రైల్వే మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీలోని RPF అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో కనిపించిన కానిస్టేబుల్‌ను దయా బస్తీలోని RPF రిజర్వ్ లైన్‌కు తరలించామని, డివిజనల్ స్థాయి విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 18, 2025న ఢిల్లీ సారాయ్ రోహిల్లా స్టేషన్‌లో జరిగిందని తెలిపింది. వీడియోలోని యువకుడు నెంబర్‌ 22482 ఉన్న రైలు అలారం గొలుసు లాగడంతో ఆగిపోయిందని, RPF అధికారికి సరైన గుర్తింపు వివరాలను అందించకపోవడంతో ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకుతోసే ప్రయత్నం చేశాడని RPF పేర్కొంది. సంఘటన సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద నిలబడి ఉందని, కదులుతున్న రైలు నుంచి ప్రయాణీకుడిని తోసివేశారనేది తప్పుడుడు ఆరోపణ అని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ మేరకు RPF వివరణ ఇచ్చినప్పటికీ అనేక మంది నెటిజన్లు అధికారి ప్రవర్తనను దుయ్యబడుతూనే ఉన్నారు. ప్రయాణీకుడు చైన్ లాగినా, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా.. కారణం ఏమైనాగానీ అతడిపై అంత దురుసుగా ప్రవర్తించడం అన్యాయమని అంటున్నారు. కాగా ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని RPF తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.