వారణాసి, ఆగస్టు 1: నేటి బిజీ లైఫ్‌లో చక్కగా వండుకుని, కడుపు నిండా తినేవాళ్లు బొత్తగా కరువయ్యారంటే అతిశయోక్తి కాదు. తిండి తినడానికి కూడా సమయం లేదని ఎక్కువగా బేకరీ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. అనేక చోట్ల ఉద్యోగాలు చేసే వారు ఇలా బేకరీ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఈ కారణం చేతనే మన దేశంలో బేకరీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ముఖ్యంగా బేకరీ ఫుడ్‌లలో పఫ్‌లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పైగా వాసన కూడా ముక్కుపుటాలను యమ ఘాటుగా తగులుతుంది. దీంతో ఎక్కడున్న సారే వెంటనే బేకరీలో వాలి పోయి వీటిని రుచి చూస్తుంటారు భోజన ప్రియులు. అయితే కొందరు లాభాలకు కక్కుర్తి పడి నాణ్యతలేని ఆహారాలను తయారు చేసి, ప్రజల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. ఈ వీడియో చూశారంటే మాత్రం జన్మలో ఎగ్ పఫ్ లేదా కర్రీ పఫ్‌ల జోలికి వెళ్లరు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..
వారణాసిలోని రామ్‌కటోరాలో ఉన్న ప్రసిద్ధ రెస్టారెంట్‌కు సంబంధించి ఈ వీడియో. ఈ వీడియోలో ఒక కస్టమర్ రెస్టారెంట్‌లో కర్రీ పఫ్‌లను కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత వీటిని తిందామని అదే రెస్టారెంట్‌లో ఓ టేబుల్ వద్దకు వచ్చి కూర్చుని, తమ ప్యాకెట్ ఓపెన్ చేస్తారు. ఒక పఫ్ తీసుకుని, ఓపెన్ చేసి చూడగా.. అందులో ఫంగస్‌తో కూడిన బంగాళాదుంప కర్రీ కనిపిస్తుంది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అతను కొన్న అన్ని పఫ్‌లు ఇలా ఫంగస్‌తో నిండి ఉండటంతో సదరు కస్టమర్‌కు చిర్రెత్తుకొస్తుంది. వెంటనే వెంటనే రెస్టారెంట్‌లో పని చేసే ఓ వ్యక్తిని పిలిచి.. అన్ని పఫ్‌లను ఓపెన్ చేసి చూపించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ పఫ్‌లను చూస్తే ఎవరైనా ఖచ్చితంగా షాక్‌కు గురవుతారు. ఎందుకంటే ఎవరైనా ఈ పఫ్‌లను తింటే వారు ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్లడం ఖాయం. ఇక ఈ వీడియోలో ఫంగస్ పట్టిన పఫ్‌లను కస్టమర్ చూపించడంతో రెస్టారెంట్‌లో పని చేస్తున్న వ్యక్తి వాటిని వెంటనే మార్చి, వేరొకటి తీసుకోమని సలహా ఇస్తాడు ఇది విన్న కస్టమర్ మరింత ఆగ్రహానికి గురవుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మిలియన్లలో వ్యూస్, లక్షల్లో కామెంట్లు, లైకులు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
‘వైద్యులు బయటి ఆహారాన్ని ఎందుకు తినొద్దని చెబుతారో ఇప్పుడు నాకు అర్థమైంది.’ ‘ఇది తినడం అంటే జబ్బులు కొని తెచ్చుకోవడమే’, ‘ఈ వీడియో ఎక్కువ మంది ప్రజలకు అవగాహన కల్పిస్తోంది’ అని పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.