
పాట్నా, డిసెంబర్ 16: పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు చొక్కా నితీశ్‌కుమార్.. అడపాదడపా ఆవారా పనులతో ఇలా అభాసుపాలౌతున్నారు ఎందుకు? హోదాకు తగ్గ హుందాతనమెక్కడ? బిహార్ పెద్దాయనకేమైందసలు? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. వద్దు మొర్రో అంటున్నా పరాయి మహిళ మెళ్లో దండేసి… తాజాగా ఓ బహిరంగ వేదికపై ఓ ముస్లిం మహిళా డాక్టర్ బురఖాను కిందికి లాగి… నలుగురిలో అబాసుపాలయ్యాడు. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కేమైంది? వయసు మీద పడ్డ ప్రభావమా లేక, మానసిక పరిస్థితి బాగోలేదండానికి సంకేతమా? అటు, విపక్షాలు ఎక్కితొక్కేస్తున్నా, స్వపక్షం ఇరకాటంలో పడుతున్నా ఆయన తీరు మాత్రం మారడం లేదు. నేనింతే టైపులో నడుస్తోంది నితీశ్‌కుమార్ మేనరిజమ్. అసలేం జరిగిందంటే..
కొత్తగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చే కార్యక్రమం అది. పాట్నాలోని సీఎం నివాసమే వేదిక. ఎదురుగా వేలాదిమంది జనం ప్లస్ డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు. నవ్విపోదురు గాక నాకేటి.. అనుకున్నారో ఏమో ఆయుష్ సర్టిఫికెట్‌ను అందుకోవడానికి వచ్చిన ఒక ముస్లిం మహిళా డాక్టర్ హిజాబ్‌ను కిందకు లాగి, ఆమె ముఖం చూసి ఓవరాక్షన్‌కి పాల్పడ్డారు సీఎం నితీశ్‌కుమార్. ఆ వెనకే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నివారించే ప్రయత్నం చేసినా ఆయన ఆగలేదు. సీఎం చర్యకు మహిళ స్పందించనప్పటికీ.. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది. అదే స్టేజీపై ఉన్న కొందరు నవ్వుతూ కనిపించడం విడ్డూరం. ఇంకేముంది? క్షణాల్లో ఈ వీడియో వైరలైంది.
నితీష్‌కుమార్ 100 శాతం పక్కా సంఘ్ కార్యకర్తగా మారిపోయారంటూ ఆర్జేడీ నుంచి అప్పుడే రియాక్షన్లొచ్చేశాయి. వెర్రివెర్రి వెరైటీలు మానుకోండి.. రాజకీయాల నుంచి తప్పుకోండి అని వార్నింగులూ జారీ ఔతున్నాయి. మరో విపక్షం కాంగ్రెస్ కూడా నితీష్ మేనరిజాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఇదేం పొయ్యే కాలమయ్యా? అని సోషల్ మీడియాలో సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలో మహిళలకు భౌతిక భద్రతే కాదు, నైతిక భద్రత కూడా లేదన్న నినాదాన్ని ముందుకు తెస్తోంది అపోజిషన్ పక్షం. ఈ మొత్తం వ్యవహారంలో లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోయేది ఎవరంటే జేడీయూ లీడర్లు, క్యాడర్లు.
ये बिहार के मुख्यमंत्री नीतीश कुमार हैं।
इनकी बेशर्मी देखिए- एक महिला डॉक्टर जब अपना नियुक्ति पत्र लेने आई तो नीतीश कुमार ने उनका हिजाब खींच लिया।
बिहार के सबसे बड़े पद पर बैठा हुआ आदमी सरेआम ऐसी नीच हरकत कर रहा है। सोचिए- राज्य में महिलाएं कितनी सुरक्षित होंगी?
नीतीश कुमार… pic.twitter.com/2AO6czZfAA
— Congress (@INCIndia) December 15, 2025
ఒకప్పుడు గ్రౌండ్‌టుఎర్త్ మేనరిజమ్‌తో మాంచి మాస్ అప్పీల్‌తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న లాలూ ఒకవైపు.. చిత్రవిచిత్రమైన చేష్టలతో నెగిటివ్ వార్తల్లో నలుగుతున్న నితీష్ మరోవైపు… తూకమేసి చూసుకుంటోంది బిహార్ ప్రజానీకం. 75 ఏళ్ల వయసులో హుందాగా వ్యవహరించాల్సిన నితీష్ కుమార్ ఎందుకిలా చేస్తున్నట్టు? ఆయన మానసిక పరిస్థితి క్షీణిస్తోందా? అని కొత్తకొత్త అనుమానాలు పుట్టి, పార్టీకి తలవొంపులొచ్చే పరిస్థితి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.