Ratan Tata Death: మధ్యతరగతి వారి కోసం నష్టాలు ఎదురైనా వెరవకుండా లక్షకే నానో కార్..

|

Oct 10, 2024 | 9:53 AM

ఈ దేశం- ఒక నేషనల్‌ ఐకాన్‌ని కోల్పోయింది. రతన్‌టాటా ఈరోజు మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త. అంతకుమించిన మహా మనీషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ కార్పొరేట్లకు అంతనంత ఎత్తులో ఉండే వ్యక్తి రతన్‌టాటా. మనదేశంలో చూస్తున్న స్టార్టప్‌ విప్లవానికి ఆయన ప్రేరణగా నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ దేశం నివాళులు అర్పిస్తోంది.

Ratan Tata Death: మధ్యతరగతి వారి కోసం నష్టాలు ఎదురైనా వెరవకుండా లక్షకే నానో కార్..
Ratan Tata Nano Car
Follow us on

రతన్‌టాటా అనగానే సగటు భారతీయుడికి ఠక్కున గుర్తొచ్చేది నానో కారు. నానో కారు.. కార్ల ప్రపంచంలో ఓ అద్భుత ఆవిష్కరణ. లక్ష రూపాయలకే ప్రతి ఇంటికి కారు అందిస్తానని హామీ ఇచ్చిన రతన్‌టాటా అలాగే ప్రారంభించారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బైక్‌ ధరలకే కారు అందుబాటులో ఉండటం ఎంత సాహసం? అదే టాటా పరిచయం చేసిన ‘టాటా నానో’ కారు.  ఈ కారు మధ్యతరగతి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రతి ఇంటికి కారు అందిస్తానన్న ఈ దిగ్గజ కల నెరవేరడానికి టాటా గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. అయినా ఇచ్చిన హామీ మేరకు నానో కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టారు రతన్‌టాటా. టాటా నానో కార్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో లక్ష రూపాయలకే కారు అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే.. నానో కారును రతన్ టాటా కలల కారుగా చెప్పుకుంటారు.  ముంబైలో ఓ ఫ్యామిలీ అంతా ద్విచక్ర వాహనంపై వెళ్తుండటం చూసిన రతన్ టాటా మధ్యతరగతి వారి కోసం నానో కారు తీసుకురావాలని నిర్ణయించుకుని.. ఆ దిశగా ముందడుగు వేశారట. మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఏడాది ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును నానో దక్కించుకుంది.  ఆ తర్వాత విడి భాగాల రేట్లు విపరీతంగా పెరగడంతో కారును రూ.లక్షకే అందివ్వడం కష్టతరంగా మారింది. ఇక ధరలు స్వల్పంగా పెంచాల్సి వచ్చింది.

1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్‌ టాటా.. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్‌ టాటా.. 1962లో టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..