‘INDIA’ కూటమిలో ముదిరిన విభేదాలు.. దీదీకి అధిర్ రంజన్ కౌంటర్.. రాహుల్ గాంధీ క్లారిటీ.!

బెంగాల్‌లో ఇండియా కూటమి విచ్చిన్నమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. గురువారం రాహుల్‌ జోడో యాత్ర బెంగాల్‌‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో కూటమిలో కుమ్ములాటలు ముదిరాయి. కాంగ్రెస్‌, టీఎంసీ, లెఫ్ట్‌ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.

INDIA కూటమిలో ముదిరిన విభేదాలు.. దీదీకి అధిర్ రంజన్ కౌంటర్.. రాహుల్ గాంధీ క్లారిటీ.!
India Alliance

Updated on: Jan 24, 2024 | 12:30 PM

బెంగాల్‌లో ఇండియా కూటమి విచ్చిన్నమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. గురువారం రాహుల్‌ జోడో యాత్ర బెంగాల్‌‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో కూటమిలో కుమ్ములాటలు ముదిరాయి. కాంగ్రెస్‌, టీఎంసీ, లెఫ్ట్‌ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తునప్పటికి ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరావడం లేదు. బెంగాల్‌లో అయితే పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇండియా కూటమి భాగస్వామి పార్టీలు తలోరీతిన మాట్లాడుతున్నాయి. బెంగాల్‌లో అసలు పొత్తు సాధ్యమేనా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెంగాల్‌ సీఎం మమత, కాంగ్రెస్‌ నేత అధిర్‌రంజన్‌ చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

లెఫ్ట్‌ పార్టీల పేరెత్తితే దీదీకి చిర్రెత్తిపోతోంది. బెంగాల్‌ను 34 ఏళ్ల పాటు పాలించిన సీపీఎంతో తాను రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు మమత. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని లెఫ్ట్‌ పార్టీలు డామినేట్‌ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను కూడా లెఫ్ట్‌ నేతలు ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు 2 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

అయితే మమతకు గట్టిగా కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ నేత అధిర్‌రంజన్‌ చౌదరి. బెంగాల్‌లో తమకు మమత దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ 42 సీట్లలో పోటీకి రెడీగా ఉందన్నారు. లెఫ్ట్ పార్టీలు కూడా మమత తీరుపై మండపడుతున్నాయి. గురువారం రాహుల్‌ జోడో యాత్ర బెంగాల్‌‌లోకి ప్రవేశిస్తుంది. టీఎంసీ నేతలు రాహుల్‌ జోడో యాత్రకు హాజరైతే తాము అందులో పాల్గొనబోమని సీపీఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇండియా కూటమిలో విభేదాలు లేవంటున్నారు రాహుల్‌గాంధీ. బెంగాల్‌లో పొత్తులపై అధిర్‌రంజన్‌ మాటలకు ప్రాధాన్యత లేదన్నారు. తనతో దీదీ నేరుగా టచ్‌లో ఉన్నారన్నారు.