
ఓటు ఉన్న వయోజనులంతా తమ ఆధార్ కార్డును ఓటరు కార్డుకు అనుసంధానించాలని కేంద్రప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చాలా మందికి ఈ విషయంపై స్పష్టత లేదు. ఇప్పటికి తమ ఓటరు కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేసుకోని ఓటర్లు చాలా మంది ఉన్నారు. దీంతో ఆధార్ సంఖ్య ఓటు కార్డుతో అనుసంధానించకపోతే తమ ఓటు డిలీట్ అయిపోతుందేమోననే భయం చాలా మందిలో నెలకొంది. దీంతో ఓటరు కార్డుకు ఆధాన్ లింక్ పై కేంద్రప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పష్టతనిచ్చింది. ప్రతి ఓటరు తమ ఆధార్ సంఖ్యను ఓటరు కార్డుతో అనుసంధానించుకోవాలని సూచించామని, అయితే ఈ నిర్ణయం నిర్భందం కాదని, వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ వేదికగా తెలిపారు. ఎవరైనా తమ ఆధార్‌ను ఓటరు కార్డుకు లింక్ చేసుకోకపోయినా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించబడదన్నారు. ఈ అంశానికి సంబంధించి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఈఏడాది ఆగష్టు 1 నుంచి ఓటర్ల ఆధార్ నంబర్‌ను ఎన్నికల సంఘం సేకరిస్తుందన్నారు. అయితే ఇది ఓటరు యొక్క వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. సదరు ఓటరు తాను ఇవ్వాలనుకుంటే స్వచ్ఛందంగా ఆధార్ సంఖ్య తెలిపి లింక్ చేయించుకోవచ్చని, లేకుంటే ఎటువంటి బలవంతం లేదన్నారు.
ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం 2021 ప్రకారం ఓటర్లు తమ ఆధార్ సంఖ్యను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఓటర్ల నమోదు అధికారి) అందించాలనే నిబంధన ఉందని, ఇది స్వచ్ఛందం మాత్రమేనని చెప్పారు. ఈ ఏడాది ఆగష్టులో ఎన్నికల సంఘం ఆధార్ వివరాలను తెలపడానికి విడుదల చేసిన 6బి దరఖాస్తులో కూడా ఆధార్ వివరాలు ఇవ్వడం స్వచ్చఃదమని పేర్కొంది. అయినప్పటికి చాలామంది ఓటర్లలో ఓ రకమైన ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌కు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..