
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. పుతిన్‌తో పాటు కీలక శాఖల మంత్రులు ఇండియాకు వచ్చారు. వాణిజ్యం, రక్షణ, ఇతర రంగాల్లోనూ పలు ఒప్పందాలకు పుతిన్-మోదీ శ్రీకారం చుట్టనున్నారు. 10 ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య జరుగుతాయి. 15కు పైగా ఒప్పందాలు వాణిజ్య- వాణిజ్యేతర సంస్థల మధ్య కుదురనున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి, SCO, G20, BRICSలో సహకారం, 2026లో భారత్ అధ్యక్షత వహించే BRICS అంశాలపై మోదీ- పుతిన్ చర్చిస్తారు.
S-400 మిస్సైల్ సిస్టమ్‌ల అదనపు డెలివరీ, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చకు రానున్నాయి. S-400 ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్‌లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు స్క్వాడ్రన్‌ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ కోరుతోంది. Su-57 ఫైటర్ జెట్‌లపైనా చర్చ జరగనుంది. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కంటే Su-57 తక్కువ ధరకు లభిస్తుంది. భారత్‌లోనే తయారీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయాలన్న అంశంపై ప్రధాని మోదీ, పుతిన్ మధ్య చర్చల తర్వాత క్లారిటీ రానుంది. S-500 సిస్టమ్ భారత్ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిస్సైళ్లను సైతం గాల్లోనే పసిగట్టి ధ్వంసం చేయగలదు.
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్‌పైనా సుంకాల మోత మోగిస్తోంది. ఈ క్రమంలో పుతిన్.. ఇండియా పర్యటనపై అగ్రరాజ్యం ఎలా రియాక్ట్ అవుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..