కురుక్షేత్ర, సెప్టెంబర్ 6: హర్యానాలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో తనకు పార్టీ టిక్కెట్ నిరాకరించిందని ఓ ఎమ్మెల్యే గుక్కపట్టి ఏడ్చారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొంది. అయితే బీజేపీ పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని, ఇప్పుడేం చెయ్యాలో తనకు బోధపడటం లేదని మాజీ ఎమ్మెల్యే శశిరంజన్ పర్మార్ గురువారం ఓ ఇంటర్వ్యూలో కన్నీటిపర్యాంత మయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హర్యాణా రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ కూడా తమ లిస్టును బయటపెట్టింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు చోటు దక్కలేదు. దీనిపై స్థానిక మీడియా ఆయనను ప్రశ్నించగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శశి రంజన్ ఆవేదనకు గురయ్యారు. తన పేరు జాబితాలో ఉంటుందని భావించానని, బివానీ లేదా తోషామ్ నుంచి పోటీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ జాబితాలో తన పేరు లేదని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. దీంతో కెమెరా ముందే ఎమ్మెల్యే ఏడ్చేశారు. ‘నాపేరు పార్టీ అధీష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రజలకు హామీ ఇచ్చాను. నేను ఇప్పుడు ఏమి చేయాలి? నేను నిస్సహాయుడిని అయ్యానంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎమ్మెల్యేను ఓదార్చాడు. పార్టీ ఆయన విలువను గుర్తిస్తుందని, అలాగే ఆయన నియోజకవర్గం కూడా గుర్తిస్తుందని నాలుగు ఓదార్పు మాటలు చెప్పాడు.
Shashi Ranjan Parmar, former BJP candidate from Tosham, broke down in tears after losing his ticket to Shruti Choudhry, Has called a meeting with his supporters on September 6 at Bhiwani. may contest as independent #HaryanaElections2024 #BJP #Tosham #ShashiRanjan #ShrutiChoudhry pic.twitter.com/VgQimmX4Of
— Sushil Manav (@sushilmanav) September 5, 2024
కాగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న జరగాల్సిన ఓటింగ్‌ను ఎన్నికల సంఘం అక్టోబర్ 5కి రీషెడ్యూల్ చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ బుధవారం అభ్యర్థుల తొలి జాబితాను వెలువరించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైనీని.. కర్నాల్ నుంచి పోటీ చేయనున్నారు. అక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే లాడ్వా స్థానానికి నామినేట్ చేశారు. అలాగే ఇటీవల పార్టీలో చేరిన అనేక మందికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. హర్యానాలో వరుసగా రెండు సార్లు విజయకేతనం ఎగురవేసిన బీజేపీ.. మూడోసారి కూడా గెలుపొందాలని పక్కా ప్రణాళికతో కార్యచరణ రూపొందిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఈసారి గట్టిపోటీ ఉండబోతుంది.