అది నాగుపాము. ప్రమాదకర విషసర్పం. కాటేసిన నిమిషాల వ్యవధిలో చికిత్స అందించకపోతే ప్రాణాలు పోతాయి. అలాంటి పాముతో ఓ మందుబాబు పరాచకాలు ఆడాడు. ఆ పామును పట్టుకుని.. సోయి లేకుండా.. ఒళ్లు తెలీయకుండా ప్రవర్తించాడు. అది ఊరుకుంటుందా చెప్పండి.. ఏకంగా నాలుగు సార్లు కాటు వేసింది. కొంత సేపటికి అతను నేలమీద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడు చనిపోయాడని అందరూ భావించారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అందరూ షాకయ్యి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కర్నాటకలోని గడగ్ జిల్లా నరగుంద తాలూకాలోని హిరేకొప్ప గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.
అతడి పేరు సిద్దప్ప బలగనూర్. మద్యం మత్తులో ఇంట్లో ఉన్న అతడికి.. పాము, పాము అన్న కేకలు వినిపించాయి. దీంతో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి. రావడంతోనే పామును వెంటాడాడు. దాన్ని పట్టుకుని.. కొద్ది సేపు అందరికీ చూపించాడు. ఆపై నేలపై విసిరేశాడు. పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును మళ్లీ వెంటాడాడు. అది పొదల్లోకి వెళ్లినా వదల్లేదు. మళ్లీ దాన్ని పట్టేశాడు. ఈ క్రమంలోనే పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. ఆ మందు మైకంలో అతడికి అప్పుడు అర్థం కాలేదు కానీ.. తర్వాత సొమ్మసిల్లి పడిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చలనం లేకపోవడంతో మరణించాడని అందరూ భావించారు. పాముకాటుతో సిద్దప్ప మృతి చెందాడన్న వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. సిద్దప్ప అంత్యక్రియలకు బంధువులు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ, కొంతసేపటి తర్వాత అతడు తిరిగి స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..