Viral: ఆ సినిమాకి పోయినోళ్లు… సీదా ఆ గుహ వద్దకు వెళ్తున్నారు… ఏంటా అని వెళ్లి చూడగా..

ఛావా చిత్రంలోని ఓ సన్నివేశం- మధ్యప్రదేశ్‌ బుర్హాన్‌పూర్‌ అసీర్‌గఢ్ ఫోర్ట్‌లో పెద్ద ఎత్తున తవ్వకాలకు దారి తీసింది. బంగారు నాణేల అన్వేషణ కోసం స్థానికులను ప్రేరేపించింది. వందల సంఖ్యలో స్థానికులు, ఇరుగు పొరుగు గ్రామస్తులు పలుగు, పార, జల్లెడ పట్టుకుని ఆ కోటకు పరుగులు తీయడానికి కారణమైంది.

Viral: ఆ సినిమాకి పోయినోళ్లు... సీదా ఆ గుహ వద్దకు వెళ్తున్నారు... ఏంటా అని వెళ్లి చూడగా..
Treasure Hunt

Updated on: Mar 08, 2025 | 4:32 PM

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ వీరత్వంపై తీసిన ఛావా సినిమాలోని దృశ్యాలు కోటలో తవ్వకానికి దారితీశాయి. రాత్రయిందంటే చాలు… మధ్యప్రదేశ్‌‌లోని అసిర్‌ఘర్‌ కోటలో వందలాది మంది జనం దీపాలు, టార్చిలైట్లతో దండెత్తుతున్నారు. బంగారు నాణెల కోసం వాళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. అసిర్‌ఘర్‌ కోటలో బంగారం గని ఉన్నట్టు ఛావా సినిమాలో చూపించారు. చాలా సీన్స్‌ ఈ కోటలో చిత్రీకరించారు. కోటలో తమకు విలువైన నాణెలు దొరుకుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికులే కాకుండా బయటి వ్యక్తులు కూడా అసిర్‌ఘర్‌ కోటకు వస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. మొఘల్‌ కాలం నాటి నుంచి ఈ కోటకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. బంగారం కోసం అక్కడ తవ్వకాలు అప్పటి నుంచే గుట్టుచప్పుడు కాకుండా జరిపేవారని సమాచారం. నిధి కోసం గ్రామస్తులు తవ్వకాలు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించిన చారిత్రాత్మక చిత్రం ఛావా. సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఓడించిన తరువాత మరాఠా రాజుల వద్ద ఉన్న లెక్కలేనంత నిధి నిక్షేపాలను అప్పటి మొఘల్ కింగ్ ఔరంగజేబ్ దోచుకున్నాడని, దాన్ని బుర్హాన్‌పూర్‌లో గల అసీర్‌గఢ్ కోటలో దాచి పెట్టాడనేది సినిమాలోని సీన్. దీంతో అక్కడ నిధి ఉంది అన్నది స్థానికుల నమ్మకం. తమ నమ్మకాన్ని సినిమా బలపరచడంతో.. కోట సమీపంలో బంగారు నాణేలను పాతిపెట్టారని భావించి.. తవ్వకాలు జరుపుతున్నారు. ఒకప్పుడు మొఘల్ కేంద్రంగా ఉన్న బుర్హాన్‌పూర్ ఇప్పుడు చీకటి పడితే చాలు కోలాహలంగా మారుతుంది. నిధిని వెలికితీసే ఆశతో గ్రామస్తులు సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అసిర్‌గఢ్ కోట సమీపంలో తవ్వుతున్నట్లు వైరల్ వీడియోలు చూపిస్తున్నాయి.

ఈ వీడియోలు ఆన్‌లైన్‌తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సర్కులేట్ అవ్వడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. వారు అక్కడికి వచ్చే సమయానికి  పెద్ద పెద్ద గుంతలే అక్కడ దర్శనమిచ్చాయి. దీంతో కోటలో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఛావా చిత్రం మరాఠా పాలకుడు… ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం… శివాజీ సావంత్ మరాఠీ నవల ఛావా ఆధారంగా రూపొందించబడింది. మహారాణి యేసుబాయిగా రష్మిక మందన్న, ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా, సర్సేనాపతి హంబీరావు మోహితేగా అశుతోష్ రాణా, ప్రిన్స్ అక్బర్‌గా నీల్ భూపాలం, సోయారాబాయిగా దివ్య దత్తా నటించారు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 500 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.  మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించిన ఈ హిందీ వెర్షన్ ఫిబ్రవరి 14న ప్రీమియర్ అయింది. తెలుగు డబ్ వెర్షన్ మార్చి 7న థియేటర్లలోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..