బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే కూటమి అభ్యర్థి అయిన విజయ్ కుమార్ సిన్హాను ఎన్నుకున్నారు. బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ స్పీకర్ ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. స్పీకర్ పదవి కోసం ఎన్డీయే నుంచి విజయ్ కుమార్ సిన్హా నామినేషన్ వేయగా, మహా కూటమి తరఫున అవద్ బిహారీ చౌదరి పోటీకి దిగారు. ఈ పోటీలో విజయ్ సిన్హా 126 ఓట్లు పొంది స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక మహాకూటమి అభ్యర్థికి 114 ఓట్లు దక్కాయి. అయితే, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపు వ్యవహారం పెను దుమారం రేపింది. లాలూ ప్రసాద్ జైలు నుండే బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేశారంటూ సుశిల్ కుమార్ మోదీ ఓ ఆడియో టేపును సంబంధిత ఫోన్ నెంబర్‌ను బహిర్గతం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం బిహార్‌లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
మరోవైపు స్పీకర్ ఎన్నిక తీరుపై అర్జేడీ నేతలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్సీలు రావడంతో స్పీకర్ ఎన్నికల్లో వాయిస్ ఓట్లను ఆర్జేడీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇక ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్ సభలో ఉండటాన్ని తప్పుబడుతూ.. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్.. స్పీకర్ ఎన్నిక సమయంలో నియమాలను పాటించాలని కోరుతూ రూల్‌బుక్‌ను ప్రొటెం స్పీకర్ జితన్ రామ్ మాంజీకి అందించారు.