Vande mataram: వందేమాతరం, జనగణమన హోదాలపై స్పష్టత ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

|

Nov 05, 2022 | 9:39 PM

దేశంలో జాతీయ గీతం జనగణమన, వందేమాతరంలో దేనికి అధిక ప్రాధాన్యత ఎక్కువ. ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యకలిగింది ఏది అనే సందేహం ఇప్పటివరకు చాలామందిలో ఉండేది. తాజాగా వందేమాతరం, జనగణమన హోదాలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాతీయ గీతం..

Vande mataram: వందేమాతరం, జనగణమన హోదాలపై స్పష్టత ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు
National Anthem Singing(File Photo)
Follow us on

దేశంలో జాతీయ గీతం జనగణమన, వందేమాతరంలో దేనికి అధిక ప్రాధాన్యత ఎక్కువ. ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యకలిగింది ఏది అనే సందేహం ఇప్పటివరకు చాలామందిలో ఉండేది. తాజాగా వందేమాతరం, జనగణమన హోదాలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జాతీయ గీతం జనగణమనకు, వందేమాతరం గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. జాతీయ గీతం జనగణమనకి సమానమైన హోదాను వందేమాతరం గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం, హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా.. తగిన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో కొద్దిరోజుల క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు.

విచారణలో భాగంగా.. ఈ వ్యవహారంపై స్పందించాలని కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కేంద్రప్రభుత్వం తాజాగా స్పందిస్తూ.. ఆ రెండింటికి సమాన హోదా ఉంటుందని వెల్లడించింది.

గతంలో విద్యాసంస్థలో ఉదయం సమయంలో వందేమాతరం, సాయంత్రం సమయంలో జనగణమన పాడేవారు. అయితే ఇటీవల కాలంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయగీతం జనగణమనను పాడుతున్నారు. దీంతో జనగణమనకు అధిక ప్రాధాన్యత లభిస్తోందని, వందేమాతరానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అభిప్రాయం కొందరిలో ఏర్పడింది. తాజాగా కేంద్రప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్లైంది. అయితే కేంద్రప్రభుత్వం నిర్ణయం తర్వాత న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..