
ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన చారిత్రక చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు ట్రయల్ రన్‌ను భారత రైల్వే శనివారం ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించింది. ఈ మార్గమధ్యంలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Three engineering marvels of Bharat;
🚄 Vande Bharat crossing over Chenab bridge and Anji khad bridge.
📍Jammu & Kashmir pic.twitter.com/tZzvHD3pXq— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 25, 2025
కశ్మీర్ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డ కట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటుచేశారు. కాగా.. గతేడాది జూన్‌లో ఈ వంతెనపై రైలు ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.