అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు.. CCTVలో భయానక దృశ్యాలు..!

నివాస సముదాయాల్లో వీధి కుక్కల సంచారం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేసే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని స్టార్ రామేశ్వరం సొసైటీలో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు.. CCTVలో భయానక దృశ్యాలు..!
Stray Dogs Attack

Updated on: Sep 04, 2026 | 11:08 AM

ఘజియాబాద్: నివాస సముదాయాల్లో వీధి కుక్కల సంచారం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేసే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని స్టార్ రామేశ్వరం సొసైటీలో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక్కసారిగా చుట్టుముట్టిన కుక్కలు

చిన్నారి బాలిక సొసైటీ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వీధి కుక్క ఒక్కసారిగా ఆమె వైపు దూసుకొచ్చింది. బాలిక దుస్తులను నోటితో పట్టుకున్న కుక్క.. ఆమెను సమీపంలో ఉన్న మరో మూడు కుక్కల వైపు లాక్కెళ్లింది. అనంతరం కుక్కలన్నీ బాలికను చుట్టుముట్టి దాడి చేశాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు బాలిక ప్రయత్నించినప్పటికీ అవి ఆమెను వెంటాడుతూ దాడి చేశాయి. ఈ క్రమంలో బాలిక శరీరంలోని పలు ప్రాంతాల్లో గాయాలైనట్లు సమాచారం. దాడితో తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి గట్టిగా ఏడుస్తూ సహాయం కోసం కేకలు వేసింది.

మహిళ ధైర్యంతో చిన్నారికి రక్షణ

దాడిని గమనించిన ఓ మహిళ వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చింది. తన వద్ద ఉన్న చెప్పులతో కుక్కలను తరిమికొట్టడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అనంతరం ఇతర సొసైటీ నివాసితులు కూడా అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. గాయపడిన చిన్నారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్లు సమాచారం.

గతంలోనూ దాడులు జరిగాయంటున్న నివాసితులు

ఈ ఘటనతో సొసైటీ నివాసితుల్లో ఆందోళన మరింత పెరిగింది. వీధి కుక్కలు చాలాకాలంగా సొసైటీ పరిసరాల్లో సంచరిస్తున్నాయని, గతంలోనూ కుక్కకాటు ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై సంబంధిత మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని వారు ఆరోపిస్తున్నారు.

రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ఇటీవలి కాలంలో వీధి కుక్కలకు సంబంధించిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతంలోని మరో సొసైటీలో కూడా చిన్నారిపై కుక్కల దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తాజా ఘటన తర్వాత వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని సొసైటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లే సమయంలో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్నారి ప్రాణాల మీదకు వచ్చిన ఈ ఘటన.. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా వీధి కుక్కల నియంత్రణ, పిల్లల భద్రతపై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us