రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డ్ లేకుంటే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులను పొందలేరు. అయితే, దేశ వ్యాప్తంగా రేషన్ కార్డ్ లేనివారు చాలా మందే ఉన్నారు. ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల చాలా మందికి రేషన్ కార్డ్ లేదు. ఇది వేరే విషయం. కొందరు కార్డు ఉన్నా.. పొగొట్టుకోవడం, చిరిగిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రజలు తమ వద్ద రేషన్ కార్డ్ లేకపోయినా.. రేషన్ సరుకులను తీసుకోవచ్చు. ఇందుకోసం యూపీ సర్కార్ ‘ఫ్యామిలీ ఐడీ’ ని ప్రారింభించింది. ఈ ‘ఫ్యామిలీ ఐడీ ద్వారా రేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఒకే గుర్తింపు కార్డ్ ఆధారంగా కుటుంబానికి అన్ని సౌకర్యాలు లభిస్తాయని యూపీ సర్కార్ చెబుతోంది. రేషన్ కార్డ్ చిరిగిపోయినా, పోగొట్టుకున్నా.. కొత్త రేషన్ కార్డ్ పొందాల్సిన అవసరం లేదని, ఫ్యామిలీ ఐడీతోనే రేషన్ సరుకులు సహా ఇతర ప్రయోజనాలన్నీ పొందవచ్చు.
యూపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యూపీ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ‘ఫ్యామిలీ ఐడీ’ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ఐడీ పొందడానికి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ అయిన https://familyid.up.gov.in ని సందర్శించాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత, అవసరమైన వివరాలను పూరించాలి. ఆ తరువాత ఒక ఫారమ్ వస్తుంది. దానిని నింపాలి. ఇదంతా పూర్తయిన తరువాత మీ పేరు మీద ‘ఫ్యామిలీ ఐడీ’ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్‌ను బద్రపరుచుకోవాలి.
ఈ నెంబర్ ద్వారా రేషన్ దుకాణం నుంచి ఉచిత రేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ ఫ్యామిలీ ఐడీ ప్రత్యేక గుర్తింపు కార్డుగా పని చేస్తుంది. దీని ద్వారా ఉచిత రేషన్ ప్రయోజనాన్ని పొందడమే కాకుండా, జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఇన్‌కమ్, క్యాస్ట్ ఇతర ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు పొందేందుకు ఉపయోగపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..