ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక ఆహ్వానం పంపారు. భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు అమెరికాలో పర్యటించాలంటూ భారత ప్రధాని మోడీకి.. బైడెన్ ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వేసవిలో తమ దేశపర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది. అయితే, ఆహ్వానాన్ని పీఎంఓ అధికార వర్గాలు సైతం సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఇరు దేశాల అధికారులు ఇప్పుడు పరస్పర అనుకూలమైన తేదీల కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించారని.. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ మన్నించారని, త్వరలోనే ఆ దేశంలో పర్యటిస్తారని పీఎంఓ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జూన్, జులై నెలల్లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోదీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్‌ను రూపొందిస్తామని పీఎంవో పేర్కొంది.
కాగా, ప్రధాని మోడీ చివరిగా 2021లో అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో వాషింగ్టన్లో బైడెన్, మోడీ మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజా ఆహ్వానం మేరకు ఈ ఏడాది మరోమారు మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. మోడీ గౌరవార్థంగా అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, గతేడాది బాలిలో జరిగిన జీ20 సదస్సులో ఇరువురు నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోని రెండు దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని.. అందుకే భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఆహ్వానించినట్లు వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆహారం, ఆరోగ్య భద్రత, వాతావరణ సంక్షోభం, స్వేచ్ఛ, ఇండో-పసిఫిక్ సమస్యలు, పలు దేశాల నుంచి ముప్పు, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల గురించి.. యుఎస్-ఇండియా చర్చిస్తాయని తెలిపాయి.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, చైనా ఆధిపత్యం, ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, దౌత్య సంబంధాలపై ఇరు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. స్వయంగా బైడెన్.. ప్రధాని మోడీని ఆహ్వానించడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా సహా రష్యా పలు దేశాలు ఈ సమావేశంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..