UP Woman, 5 Children Hungry: ఓ మహిళ కన్నీటి గాధ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కాలంలో భర్త చనిపోవడంతో.. ఓ మహిళ, ఐదుగురు పిల్లలు దయనీయ పరిస్థితిలో కూరుకుపోయారు. దాదాపు రెండు నెలలుగా వారంతా ఆకలితో ఆలమటిస్తూ బతుకీడుస్తున్నారు. వారి దయనీయ పరిస్థితిని చూసి వివరాలు తెలుసుకున్న ఓ ఎన్జీఓ సంస్థ ప్రతినిధి వెంటనే చలించిపోయారు. వారందరినీ ఆసుపత్రిలో చేర్పించి అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారి ఆదేశించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది.
అలీఘర్ ప్రాంతానికి చెందిన 45 ఏండ్ల గుడ్డీ అనే మహిళ, ఆమె ఐదుగురు పిల్లలు గత రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉండటంతో.. వారి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఒకరు ఎన్జీవో సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ సభ్యులు ఆ కుటుంబాన్ని అలీఘర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చేర్పించారు. వారికి ఆహారం, పండ్లు, వైద్య సదుపాయాన్ని కల్పించారు. అనంతరం అలీఘర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర భూషణ్ సింగ్ మహిళ వివరాలను సేకరించారు.
గతేడాది లాక్‌డౌన్ కాలంలో తన భర్త చనిపోవడంతో 20 ఏండ్ల కుమారుడిపై తాము ఆధారపడినట్లు గుడ్డీ తెలిపింది. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పనులు లేవని, దీంతో సుమారు మూడు నెలలుగా తినడానికి తిండి లేక పస్తులుంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. గ్రామ పెద్దను సహాయం కోరినా.. చేయలేదని, వంద రూపాయలు ఇమ్మని అడిగినా ఇవ్వలేదని పేర్కొంది. రేషన్ షాపు డీలర్‌ను ఐదు కేజీల బియ్యం అడిగినా ఇవ్వలేదని తెలిపింది. ఎవరైనా ఏదైనా ఇస్తే తింటామని లేకపోతే పస్తులే ఉంటున్నామని వివరించింది. తాను ఎక్కడికి వెళ్లాలంటూ రోదించింది.
అయితే.. ఆ మహిళకు ఆధార్, రేషన్ కార్డు లేకపోవడంపై అలీగఢ్ జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్ మాట్లాడుతూ.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ మహిళకు తక్షణం రూ.5 వేల ఆర్థిక సహాయంతోపాటు అంత్యోదయ కార్డును సమకూర్చినట్లు తెలిపారు. ఆధార్ కార్డుతోపాటు బ్యాంకు ఖాతాను తెరిచి ప్రభుత్వ సహాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి మంచి ఆహారాన్ని అందిస్తూ యోగక్షేమాలను చూసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె ఆసుపత్రికి వచ్చినప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు.
Also Read: