సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన జరుపుతున్న నిరసనకారులు మీరట్ లో పెద్దఎత్తున హింసకు దిగారు. తమపై గన్స్ ఎక్కుపెట్టినవారిలో ఇద్దరు ఆందోళనకారుల వీడియోలను యూపీ పోలీసులు విడుదల చేశారు. గత శుక్రవారం జరిగిన అల్లర్లలో ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా గన్ తో పోలీసులనే భయపెట్టాడు. ఈ నెల 19 -21 తేదీల మధ్య హింసకాండకు పాల్పడిన నిరసనకారులనుంచి తాము ఈ విధమైన దాడి యత్నాలను ఎదుర్కొన్నామని,తప్పనిసరి పరిస్థితుల్లో తాము కూడా ఎదురు కాల్పులు జరపవలసివచ్చిందని ఖాకీలు పేర్కొన్నారు. మీరట్ లో జరిగిన ఘటనల్లో ఆరుగురు మరణించారు. ఈ మృత దేహాల్లో కొన్నిటికి గన్ షాట్స్ గాయాలు ఉన్నప్పటికీ.. తాము మాత్రం ప్లాస్టిక్, రబ్బర్ బులెట్లనే వాడామని పోలీసులు చెబుతున్నారు. ఒక్క బిజ్నూర్ లో మాత్రమే జరిగిన కాల్పుల్లో ఐఏఎస్ సివిల్ సర్వీసులకు ప్రిపేరవుతున్న ఓ యువకుడు ప్రాణాలు వదిలాడని తెలిసినట్టు వారు పేర్కొన్నారు. అయితే వరుసగా జరిగిన ఘటనల్లో పోలీసులు కూడా చాలామంది గాయపడ్డారని యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ తెలిపారు. ‘ 21 జిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. పైగా ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి నిషిధ్ధమని ప్రకటించిన 500 తూటాలను ఖాకీలు స్వాధీనం చేసుకున్నారు ‘ అని ఆయన చెప్పారు.