
పోలీస్ ఉద్యోగం అంటే మాటలు కాదు.. ఎంతో కష్టపడి చదువుకొని, ఫిజికల్ టెస్టులు కూడా పాసై.. ఉద్యోగం సాధించాలి. అంత కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని ఓ ఇద్దరు పోలీసులు కేవలం రూ.10లకు కక్కుర్తి పడి, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పుచ్చకాయలు అమ్ముకునే వ్యక్తి నుంచి ఓ ఇద్దరు పోలీసులు చెరో పుచ్చకాయ తీసుకున్నారు. కానీ, వాటికి డబ్బులు ఇవ్వలేదు. ఒక్కో పుచ్చకాయ ధర కేవలం రూ.10 మాత్రమే అయినా కూడా పోలీసులం అనే అహంకారం, అధికార పలుకుబడితో డబ్బులు ఇవ్వకుండా పుచ్చకాయల తీసుకొని వెళ్లిపోయారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హర్దోయ్‌లోని పిహానీ కొత్వాలి ప్రాంతంలోని ఒక పట్టణానికి చెందిన లఖ్‌పత్ అనే వీధి వ్యాపారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతను ఇద్దరు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు చేస్తూ, ఏడుస్తూ, పోలీసు సిబ్బంది తన బండి నుండి రూ.20 విలువైన పుచ్చకాయలను బలవంతంగా తీసుకెళ్లారని చెబుతున్నాడు. వీడియో వైరల్ కావడంతో చాలా మంది అలాంటి పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత హర్దోయ్ పోలీస్ సూపరింటెండెంట్ నీరజ్ జాదౌన్ పిహానీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, బాధిత దుకాణదారుడు లఖ్‌పత్‌ను అక్కడికి పిలిపించి మొత్తం విషయం తెలుసుకున్నారు. వెంటనే పుచ్చకాయలు తీసుకెళ్లిన నిందితులైన పోలీసు సిబ్బంది అంకిత్ కుమార్, అనుజ్ కుమార్ ఇద్దరిపైనా కేసు నమోదు చేయించారు. అలాగే వాళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి