హిస్టరీ షీటర్ వికాస్ దూబే సహచరుని అరెస్ట్

యూపీలో గ్యాంగ్ స్టర్, హిస్టరీ షీటర్ వికాస్ దూబే సహచరుడిని పోలీసులు కాన్పూర్ లో అరెస్టు చేశారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తారని దూబేకి ముందే సమాచారం అందిందని దయాశంకర్ అగ్నిహోత్రి..

హిస్టరీ షీటర్ వికాస్ దూబే సహచరుని అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 3:43 PM

యూపీలో గ్యాంగ్ స్టర్, హిస్టరీ షీటర్ వికాస్ దూబే సహచరుడిని పోలీసులు కాన్పూర్ లో అరెస్టు చేశారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తారని దూబేకి ముందే సమాచారం అందిందని దయాశంకర్ అగ్నిహోత్రి అనే ఆ ‘సహచరుడు’ చెప్పాడు. దూబే ని పట్టి ఇఛ్చినవారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. అగ్నిహోత్రి పై కూడా 25 వేల రివార్డు ఉంది. ఈ నెల మూడో తేదీ తెల్లవారుజామున ఓ పోలీస్ స్టేషన్ నుంచి దూబేకి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, నిన్ను అరెస్టు చేయడానికి ఖాకీలు వస్తున్నారని అతడ్ని అలర్ట్ చేశారని అగ్నిహోత్రి చెప్పాడు. దీంతో తన సహచరులైన సుమారు 30 మందిని పిలిపించి దూబే… వారు రాగానే కాల్పులు జరిపించాడని, ఆ సమయంలో తాను ఓ ఇంట్లో దాక్కున్నందున ఏం జరిగిందో తెలియదని అతగాడు వెల్లడించాడు. దూబే తప్పించుకుని పారిపోవడంలో  ఇద్దరు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు.

కాన్పూర్ కి సుమారు 45 కి. మీ. దూరంలో ఉన్న బిక్రు (దూబే ఉంటున్న) గ్రామానికి పోలీసులు వచ్ఛే ముందే విద్యుత్ సౌకర్యాన్ని ఆపి వేశారట.. ఓ పోలీసు స్టేషన్ నుంచి అందిన కాల్ తో తాను ఈ గ్రామానికి పవర్ నిలిపివేశానని విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు పోలీసులకు చెప్పాడు. కాగా సుమారు 20 మంది పోలీసు అధికారులు దూబేతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఎవరు అతనితో లింక్ పెట్టుకున్నా వదిలే ప్రసక్తి లేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వికాస్ దూబే మధ్యప్రదేశ్ కి గానీ, రాజస్థాన్ రాష్ట్రానికి గానీ పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతడ్ని పట్టుకునేందుకు మొత్తం 25 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో సుమారు వంద ప్రాంతాల్లో గాలించారు. ఎనిమిదిమంది పోలీసులను పొట్టన బెట్టుకున్న వికాస్ దూబే ఇంటిని బుల్ డోజర్లతో కూల్చివేసిన సంగతి తెలిసిందే.