UP Assembly Elections 2022: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికలే హాట్ టాపిక్. వచ్చే ఏడాది అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలన్ని ఫోకస్ పెట్టాయి. ప్రధాన పార్టీల నేతలందరూ వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే ముందుగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాల్సిన అవసరాన్ని ప్రధాన పార్టీలన్నీ గుర్తిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రధానంగా సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తలపడనున్నాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం కూడా యూపీ ఎన్నికల బరిలో నిలవనుంది. కనీసం 150 నియోజక వర్గాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అసద్.. ఆ దిశగా పూర్తి ఫోకస్ పెట్టారు.
గురువారంనాడు తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. కరోనా సంక్షోభాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ప్రధాని కితాబిచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ.. ఓ రకంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోడీ యూపీలో పర్యటిస్తున్న వేళ.. ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆ రాష్ట్రంలో పర్యటిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోడీ, అసద్ పర్యటనలతో ఓ రకంగా అక్కడ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి.
అసద్ రోడ్‌షోకి భారీ స్పందన..
మొరాదాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారంనాడు నిర్వహించిన రోడ్‌షోకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. 2022లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసద్ అక్కడ తొలిసారిగా ర్యాలీలో పాల్గొన్నారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయంటూ ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకపడ్డారు. సెకండ్ వేవ్ సమయంలో కేంద్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా వేలాది మంది యూపీలో మరణించినట్లు ఆయన ఆరోపించారు. చాలా మంది మృతదేహాల్లో యూపీ నదుల్లో కొట్టుకువచ్చినట్లు తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎవరితోనైనా కూటమి కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసద్ చెప్పారు.
#WATCH | Scores of AIMIM chief Asaduddin Owaisi supporters gathered in UP’s Moradabad during his roadshow yesterday pic.twitter.com/RdS5u9jL6N
— ANI UP (@ANINewsUP) July 15, 2021
ఎంఐఎం పోటీతో బీజేపీకే లాభమా?
అసద్ ఎంట్రీతో యూపీలో ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కాయి. కనీసం 150 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని అసద్ ఇది వరకే ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే అధికార బీజేపీయే లాభపడొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి చివరకు బీజేపీయే లాభపడుతుందని విశ్లేషిస్తున్నారు.అలాగే యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేయడం ద్వారా బీజేపీకే ఎక్కువగా లాభం చేకూరుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూపీలో బీజేపీ సర్కారును గద్దె దించుతామంటూ అసద్ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్..అసద్ జాతీయ స్థాయి ముస్లీం నాయకుడంటూ వ్యాఖ్యానించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం మైనార్టీ ఓట్లను చీల్చితే అది తమ అభ్యర్థులకు కలిసొస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.
ఎంఐఎంపై యూపీ మైనార్టీలు ఏమంటున్నారు..?
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడాన్ని ఆ రాష్ట్రానికి చెందిన కొందరు ముస్లీం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీలో ఎంఐఎం పోటీ చేస్తే అధికార బీజేపీకే లబ్ధి చేకూరుతుందని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఆ పార్టీతో అసదుద్దీన్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలో ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డ్ మాజీ సభ్యుడు, ధివంగత ముఫ్తి ఇజాజ్ అహ్మద్ ఖాస్మి బహిరంగ ఆరోపణలు చేశారు. ముస్లీం ఓట్లను చీల్చి బీజేపీ విజయాన్ని సులభతరం చేయడమే అసద్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. అదే సమయంలో యూపీలోని కొందరు ముస్లీం నేతలు మాత్రం ఎంఐఎం పోటీని స్వాగతిస్తున్నారు. యూపీ ముస్లీంలను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. దశాబ్ధాలుగా ఆ పార్టీలు ముస్లీంల అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదంటున్నారు. ఐంఎంఐ మాత్రమే రాష్ట్రంలోని ముస్లీంల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషిచేయగలదని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
Also Read..
వైసీపీ ఎంపీల ఫిర్యాదు నేపథ్యంలో ఎంపీ రఘురామకు లోక్‌సభ సచివాలయం నోటీసులు