UP Assembly Elections 2022: యూపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలతో రథయాత్రకు ఫ్లాన్!

|

Dec 01, 2021 | 10:58 AM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలన్న సంకల్పంతో అధిష్టానం పక్కా ప్రణాళికలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది.

UP Assembly Elections 2022: యూపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలతో రథయాత్రకు ఫ్లాన్!
Up Elections
Follow us on

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అధికార భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలన్న సంకల్పంతో అధిష్టానం పక్కా ప్రణాళికలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బూత్ ప్రెసిడెంట్ల సమావేశంలో నిర్వహించిన ప్రాంతాల వారీగా అనుభవజ్ఞులైన బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈక్రమంలోనే పశ్చిమ ప్రాంతాలకు ఇన్‌ఛార్జ్‌గా హోంమంత్రి అమిత్ షాను బ్రిజ్ ఏరియాకు ప్రాతినథ్యం వహిస్తుండగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అవధ్, కాశీ ప్రాంత బాధ్యతలు అప్పగించారు. గోరఖ్‌పూర్, కాన్పూర్ రీజియన్‌లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అలాగే అయా ప్రాంతాల్లోని బూత్ అధ్యక్షులను ఏరియా ఇన్‌ఛార్జ్‌లు పర్యవేక్షిస్తారు. బీజేపీలో అనుభవజ్ఞులైన వారిని ప్రాంతాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించడం ఇదే తొలిసారి.

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు ఫ్లాన్ చేసింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, రాష్ట్ర ఎన్నికల పార్టీ ఇంచార్జ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర ముఖ్యనేతల సమక్షంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో రాష్ట్రంలోని తమ ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయడానికి 2022 ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తూ ఆరు యాత్రలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు విద్యాసాగర్ సోంకర్ యాత్రలకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ యాత్రల్లో బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేత ఒకరు తెలిపారు.

ఈ ఆరు యాత్రల్లో గత ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను బీజేపీ ప్రజలకు చెబుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపుతూ యాత్రలు చేపట్టామని, ఈసారి రాష్ట్ర ప్రజలకు మేం సాధించిన విజయాలను చెప్పుకుని మరోసారి వారి ఆశీస్సులు పొందబోతున్నామని ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాజవంశాలు, ప్రాంతీయత, భాషావాదం, కులతత్వానికి పరిమితమైన దేశ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోడీ మార్చారన్నారు. నవ భారత స్థాపన కోసం ప్రధాని మోడీ పాటుపడుతున్నారన్న యోగి.. గ్రామీణ ప్రాంతంలోని పేదలు, రైతులు, యువత, మహిళల సమగ్రాభివృద్ధికి కృషీ చేస్తున్నారన్నారు. బీజేపీ సర్కార్ సంక్షేమ పథకాల పట్ల సామాన్యులు సంతోషంగా ఉన్నారని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి ఎలాంటి వివక్ష లేకుండా పథకాల ప్రయోజనాలు చేరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సాధించిన సంక్షేమ పథకాలను రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలకు చేరవేస్తామని, ఈ యాత్రలు కులతత్వం, బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాల అడ్డుగోడలను ఛేదిస్తాయని యోగిఆదిత్యనాథ్ అన్నారు.

పార్టీ కార్యకర్తల బలం, ప్రజల ఆశీర్వాదంతో 300కు పైగా సీట్లతో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ట్వీట్ చేశారు.


మరోవైపు యాత్రల వివరాలు ఇంకా ఖరారు కాలేదని బీజేపీ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాషాయ పార్టీ 312 స్థానాలను గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు 13 స్థానాల్లో విజయం సాధించాయి. బిఎస్‌పి, కాంగ్రెస్, ఎస్‌బిఎస్‌పి, పిఎస్‌పి-లోహియాతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 11 మంది ముఖ్యనేతలు మంగళవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ మాట్లాడుతూ, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటూ 2017లో తన గణనను మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈసారి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు కావడమే కాకుండా నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాలపై ప్రజల్లో అభిమానం కూడా పెరిగిందని ఆయన అన్నారు.

Read Also….  Mother Brave Adventures: చిరుత నోట్లో కొడుకు తల.. అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. వెంబడించి కాపాడిన తల్లి!