
PM Modi inauguration of ‘Chauri Chaura’ celebrations: రైతులే మన దేశానికి వెన్నెముకని.. కరోనా సంక్షోభ సమయంలో కూడా రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో రైతులదే కీలక పాత్ర అని, వారే అభివృద్ధిని నడిపిస్తున్నారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లాలో చౌరీ చౌరా శతాబ్ధి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో రైతుల భాగస్వామ్యం ఎప్పుడూ ఉందన్నారు. చౌరీ చౌరా ఉద్యమంలోనూ వారే కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. గత ఆరేళ్ల నుంచి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రైతులను స్వయం సమృద్ధి చేసే దిశగా అడుగులు వేశామన్నారు. దీంతో కరోనా మహమ్మారి సమయంలో కూడా వ్యవసాయ రంగం వృద్ధి చెందినట్లు మోదీ తెలిపారు.
రైతుల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మోదీ వివరించారు. మండీల ద్వారా రైతులు లబ్ధి పొందేందుకు.. మరో వెయ్యి మండీలను ఈ-నామ్‌కు లింకు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో చౌరి చౌరా సంఘటనలను గుర్తు చేసుకున్నారు. చరిత్ర పుటల్లో ఈ యోధులకు ప్రాధాన్యం దక్కలేదని.. అయినప్పటికీ వారి రక్తం మన దేశ గడ్డలో ఉందని అది నిరంతరం మనల్ని ప్రేరేపిస్తుందని మోదీ పేర్కొన్నారు. అనంతరం ఫిబ్రవరి 4, 1922 న జరిగిన చౌరి చౌరా సంఘటనకు గుర్తుగా వీడియో లింక్ ద్వారా తపాలా బిళ్ళను విడుదల చేశారు.
Also Read: