Piyush Goyal: రా రైస్‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుంది.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

|

Dec 21, 2021 | 2:54 PM

తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగులుతున్న వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Piyush Goyal: రా రైస్‌ ఎంత ఇచ్చినా  కేంద్రం కొనుగోలు చేస్తుంది.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Union Minister
Follow us on

Telangana Paddy Procurement: తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగులుతున్న వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రైతాంగం ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని మోడీ కృషీ చేస్తున్నారన్న పీయూష్ గోయల్.. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు. అలాగే, ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు.

ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఎందుకు తరలించలేదని మంత్రి ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్న ఆయన.. రైతులకు ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. రా రైస్‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుందని గతంలోనే స్పష్టంచేశామన్న పీయూష్ గోయల్.. దీనిపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని పీయూష్‌ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు గడువు పొడిగించామన్నారు.

మరోవైపు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత రబీలో సీఎం కేసీఆర్ ధాన్యాన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని తెలంగాణ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తు చేశారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి 27.39 లక్షల మెట్రిక్‌ టన్నుల సరఫరా చేయాలన్నారు. ఎఫ్‌సీఐకి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.సీఎం కేసీఆర్‌ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ ఓటమి తర్వాతే కేసీఆర్‌ బియ్యం అంశం లేవనెత్తారన్నారు.మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారని కేంద్రంపై దుష్ర్పచారం చేస్తున్నారని కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా రైస్‌ ఎంత వస్తే అంత కొంటామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారన్నారు. జనవరి నుంచి జులై 31 వరకు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రంతో ఒప్పందం చేసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.