AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devayatanam: ‘దేవాలయాల విశిష్టతలను చాటి చెప్పడమే లక్ష్యం’.. ‘దేవాయతనం’ సదస్సు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

కర్ణాటకలోని హంపిలో భారతదేశంలోని దేవాలయాల నిర్మాణాలను, వాటి విశిష్టతలను వివరించే 'దేవాయతనం' సదస్సును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

Devayatanam: 'దేవాలయాల విశిష్టతలను చాటి చెప్పడమే లక్ష్యం'.. 'దేవాయతనం' సదస్సు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Union Minister G Kishan Reddy Inaugurates Conference Of Devayatanam
Ravi Kiran
|

Updated on: Feb 25, 2022 | 7:23 PM

Share

కర్ణాటకలోని హంపిలో భారతదేశంలోని దేవాలయాల నిర్మాణాలను, వాటి విశిష్టతలను వివరించే ‘దేవాయతనం’ సదస్సును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అలాగే దేశంలోని 75 విశిష్ట దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేసే బుక్‌లెట్‌ను కూడా ఆయన ఈ సమావేశంలో ఆవిష్కరించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సును సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నిర్వహిస్తోంది.

దేవాలయాలకు సంబంధించిన తాత్విక, మత, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, శాస్త్రీయ, వాస్తు, తదితర అంశాలపై సదస్సులో చర్చ జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా నగారా, వేసారా, ద్రావిడ, కళింగ, ఇతర ఆలయ నిర్మాణ శైలులు, అభివృద్ధిపై కూడా చర్చిస్తారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో దేశంలోని పురాతన, చారిత్రాత్మిక ప్రదేశాలను, కట్టడాల అభివృద్ధి, అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సాంస్కృతిక వైభవం, నమ్మకం, సాంకేతిక విజ్ఞానం, యావత్ ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎలా ముందుకు సాగుతోందన్న దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో వివరించారు.

ఈ సదస్సులో భారతదేశంలోని గొప్ప దేవాలయాలకు సంబంధించిన వివిధ కోణాలపై పండితులు చర్చించనున్నారు. ఆలయం ఆకృతి, నిర్మాణ పరిణామం, దేవాలయ ప్రాంతీయాభివృద్ధి, సంస్కృతి, విద్య, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, ఆగ్నేయాసియాలో దేవాలయాల సంస్కృతి, తదితర కీలక అంశాలు చర్చకు వస్తాయి. విద్వాంసులు, భారతీయ చరిత్ర, పురావస్తు, సంస్కృతి, వాస్తుశిల్ప శాస్త్రలకు అభ్యసించే విద్యార్థులకు, సాధారణ ప్రజలకు ఈ సదస్సు ఉపయోగకరం. పండితులు, విద్యార్థులలో భారత దేవాలయాల విశిష్టతలపై ఆసక్తిని కలిగించడమే కాకుండా.. వాటి గొప్పతనాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది. భారతీయ దేవాలయాలు వాటి అద్భుత నిర్మాణాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ నిర్మాణాలు భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెబుతాయి. ఆలయాల నిర్మాణం ఉపఖండంలోనే కాకుండా ఆగ్నేయ, తూర్పు ఆసియా వంటి సమీప పొరుగు ప్రాంతాల్లోనూ ఓ పుణ్యకార్యంగా ఆచరిస్తున్నారు. దేశంలో 2 మిలియన్లకు పైగా హిందూ దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే.