
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో హోల్డింగ్ ఏరియా విజయవంతంగా అమలు అవుతుండటంతో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఢిల్లీ నమూనా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టేషన్లలో అమలు చేయాలని భావిస్తున్నారు. దీపావళి, ఛత్ వంటి ప్రధాన పండుగల సమయంలో మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి, రద్దీని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఈ నమూనాను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా 76 రైల్వే స్టేషన్లలో నిర్మిస్తున్న హోల్డింగ్ ఏరియాల పురోగతిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు సమీక్షించారు. న్యూఢిల్లీ స్టేషన్‌లో పొందిన సానుకూల అనుభవాన్ని ఇప్పుడు జాతీయంగా పునరావృతం చేస్తామని సమావేశంలో స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న ఈ కొత్త హోల్డింగ్ ప్రాంతాలు మాడ్యులర్ డిజైన్ ఆధారంగా ఉంటాయి. అందుబాటులో ఉన్న స్టేషన్ స్థలం, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించనున్నారు. ప్రయాణీకులకు నియంత్రిత ప్రవేశ వ్యవస్థతో పాటు టికెటింగ్ కౌంటర్లు, సీటింగ్, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించడం జరుగుతుంది. ఈ నియంత్రిత ప్రవేశ వ్యవస్థ జనసమూహ నిర్వహణను మరింత బలోపేతం చేస్తుంది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని శాశ్వత హోల్డింగ్ ప్రాంతం దీపావళి, ఛత్ సమయంలో రికార్డు స్థాయి ప్రయాణీకుల రద్దీని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది. కేవలం నాలుగు నెలల్లో పూర్తయిన ఈ ప్రయాణీకుల సౌకర్య కేంద్రం ఒకేసారి దాదాపు 7,000 మంది ప్రయాణికులకు వసతి కల్పించగలదు. ప్రయాణీకుల రద్దీని సజావుగా నిర్ధారించడానికి ఈ కేంద్రం మూడు విభిన్న జోన్‌లుగా విభజించింది. టికెటింగ్, పోస్ట్-టికెటింగ్, ప్రీ-టికెటింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ హోల్డింగ్ ప్రాంతంలో పురుషులు, మహిళలకు 150 ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, ఉచిత RO నీరు కూడా అందుబాటులో ఉన్నాయి. రైలు ఎక్కే ముందు ప్రయాణీకులకు సూచనలు, సౌకర్యాలను తెలుసుకుంటారు. హోల్డింగ్ ఏరియా మోడల్ పండుగల సమయంలో తరచుగా జరిగే తొక్కిసలాటలను నివారించగలదని రైల్వే శాఖ విశ్వసిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..