Postmortem in Night: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టంకు అనుమతి

|

Nov 16, 2021 | 8:01 AM

మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటలతరబడి ఆస్పత్రుల్లోనే మృతదేహంతో నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Postmortem in Night: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టంకు అనుమతి
Postmortem
Follow us on

Postmortem in Night: దేశవ్యాప్తంగా చట్టప్రకారం మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటలతరబడి ఆస్పత్రుల్లోనే మృతదేహంతో నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న ఆస్పత్రుల్లో 24 గంటలూ పోస్టుమార్టం చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ పేర్కొన్నారు.

సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు మంత్రి మన్సూక్‌ మాండవీయ సోమవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘బ్రిటిష్‌ కాలం నాటి నుంచి అమలులో ఉన్న విధానానికి ఇప్పుడు స్వస్తి పలుకుతున్నామని.. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’అంటూ కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు.

ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. అయితే, హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేమని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరణించిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మేలు కలుగుతుందన్నారు. అలాగే, అవయవదానం చేయాలనుకునే వారి నుంచి అవయవాలు తీసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా భవిష్యత్తులో నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదిలావుంటే, మెడికో లీగల్‌ కేసుల్లోని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంపై ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ విభాగంలోని సాంకేతిక కమిటీ పరిశీలించింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, ముఖ్యంగా రాత్రివేళల్లో పోస్టుమార్టానికి అవసరమైన లైటింగ్‌తోపాటు మౌలిక సదుపాయాలను ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనని అభిప్రాయపడింది. అయితే ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు రాత్రివేళ పోస్టుమార్టం చేస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. అన్ని వేళలా పోస్టుమార్టం చేయడం సాధ్యమేనని పేర్కొంది. ఇక రాత్రిపూట చేసే పోస్టుమార్టాలకు తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Read Also… AC Helmet: ఇకపై హెల్మెట్‌ను ధరించడానికి చిరాకు పడరు.. ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు..