కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని గద్దె దించడం కోసం కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం), నిరుద్యోగంతో పాటు అధికారపార్టీని ఇరుకునపెట్టే అదానీ, ఓబీసీ అంశాలపై విమర్శలతో విరుచుకుపడాలని భావిస్తోంది. ఇప్పటి వరకు అదానీ అంశంపై రాహుల్ గాంధీతో పాటు ఒకరిద్దరు నేతలు తప్ప మిగతా ఎవరూ పెద్దగా మాట్లాడకపోవడంతో.. పార్టీ నుంచి తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అదానీపై వ్యవహారంపై రాహుల్ గాంధీకి నేతలంతా బాసటగా నిలవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పార్టీ శ్రేణులను కోరారు.
ఎత్తుకు పై ఎత్తులు చదరంగంలోనే కాదు.. రాజకీయాల్లోనూ కనిపిస్తాయి. అధికారపీఠాన్ని కైవసం చేసుకోడానికి రాజకీయ నాయకులు, పార్టీలు ఎత్తులు వేస్తుంటాయి. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తుంటాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జైత్రయాత్రను ఎలాగైనా నిలువరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్షాలన్నీ జట్టుకడితే.. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) పేరుతో జట్టుకడితే.. యావద్దేశంలోని ఏకంగా సగానికి సగం ఓటుబ్యాంకును ప్రభావితం చేసే బ్రహ్మాస్త్రంగా మహిళా బిల్లును బీజేపీ తెరపైకి తెచ్చి పాస్ చేసింది. భావోద్వేగాలు, మతపరమైన నమ్మకాలపై రాజకీయాలు చేయడంలో ఆరితేరిన బీజేపీ తన అమ్ములపొదిలో ఉమ్మడి పౌరస్మృతి, అయోధ్య రామ మందిర నిర్మాణం సహా మరికొన్ని అంశాలను సిద్ధంగా పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే నాలుగు అంశాలను ప్రాధాన్యాంశాలుగా నిర్ణయించి, వాటిపై అస్త్రాలుగా మలిచి ప్రభుత్వం ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
అదానీ వ్యవహారంలో బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక దేశంలోని వ్యాపారవేత్తల్లో అదానీ ఒక్కరే అనూహ్యరీతిలో అపరిమితస్థాయిలో లబ్ది పొందుతున్నారంటూ రాహుల్ గాంధీ చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. శ్రీలంకలో పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు సహా వివిధ దేశాల్లో అదానీ గ్రూపు కంపెనీలకు కాంట్రాక్టులు, వ్యాపార ప్రయోజనాలు అందించేందుకు సహకరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అతి తక్కువ వ్యవధిలో నిట్టనిలువుగా పెరిగిన అదానీ ఆస్తుల విలువ, ప్రపంచంలోనే అపర కుబేరుడిగా మారిన అంశం, ఆ క్రమంలో నిబంధనలకు పాతరవేశారంటూ హిండెన్‌బర్గ్ వంటి సంస్థల నివేదికలు వెరసి ఇది భారతీయ జనతా పార్టీకి ఒక తలనొప్పి వ్యవహారంగా మారింది. పార్టీలో, ప్రజల్లో అత్యంత ప్రజాదరణ కల్గిన నరేంద్ర మోదీతో నేరుగా ముడిపడ్డ అంశం కాబట్టి కమలదళంలో ఈ వ్యవహారంపై నోరు విప్పేందుకు నేతలు భయపడుతుంటారు. రాహుల్ గాంధీ ఈ అంశంపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్నప్పటికీ.. దాన్ని పార్టీలోని మిగతా నేతలు అనుసరించిన పరిస్థితి లేదు. అందుకే కేసీ వేణుగోపాల్ నేతలు, శ్రేణులందరికీ సందేశమిస్తూ.. అదానీ అంశంపై కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రమే రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, అయితే ఇప్పుడు అందరూ కలిసి ముప్పేట దాడికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. మీడియా తమ వైపు చూపకపోతే సోషల్ మీడియాలో సత్తా చూపాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు అదానీ అంశంపై చర్చ జరిగినప్పుడల్లా రాహుల్‌తో పాటు కొందరు నేతలు మాత్రమే ప్రశ్నలు సంధిస్తున్నారని, చాలా మంది కాంగ్రెస్ నేతలు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని, ఇది సరికాదని కేసీ వేణుగోపాల్ హితవు పలికారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
శనివారం ఎన్నికల వ్యూహాలపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొందరు పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అదానీతో పాటు ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ఓబీసీ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కుల గణన, ఓబీసీ రిజర్వేషన్ల గరిష్ట పరిమితి తొలగింపు వంటి అంశాలపై కూడా చర్చించారు. చాలా దూకుడుగా ఎన్నికలను ఎదుర్కోవాలని రాహుల్ సూచించారు. బీజేపీ ప్రయోగించే హిందూ సెంటిమెంట్లకు లొంగిపోకుండా, లెఫ్ట్ – రైట్ రాజకీయాలకు బదులు రెండింటికి మధ్యలో నిలబడాల్సిన సమయం ఇది అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో ఇదే అంశాన్ని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మహిళా బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలోనే సమాజంపై ప్రభావం చూపగల్గిన సినిమా సెలబ్రిటీలను పిలిపించి మరీ కొత్త పార్లమెంటును, అందులోని ఉభయ సభలను చూపించి, వారితో విస్తృతంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇప్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఇంకా అనేకరకాల కార్యక్రమాల ద్వారా మహిళా ఓటుబ్యాంకును పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఎత్తుకు పై ఎత్తుగా ఇదే బిల్లులోని కొన్ని అంశాలను కాంగ్రెస్ ఇతివృత్తంగా తీసుకుంది. దేశంలో చట్టసభల్లో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు అమలవుతూ వచ్చాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లు పాసవడంతో.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ ఆయా వర్గాల మహిళలకు మూడో వంతు వాటా దక్కనుంది. అయితే కాంగ్రెస్ సహా మరికొన్ని ప్రతిపక్షాలు ఓబీసీ మహిళల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి. నిజానికి వారందరికీ అసలు విషయం తెలుసు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా ఎలాంటి ముందడుగు లేదు. ఒకవేళ ఓబీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు ఉంటే, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కూడా కోటా వర్తించేది. అది లేనప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్న మహిళా సీట్లలో ఓబీసీలకు చోటు కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా బీజేపీని ఇరకాటంలో పడేయడం కోసం.. పనిగట్టుకుని ఓబీసీ మహిళలకు అన్యాయం చేసినట్టుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోంది. తద్వారా రాజకీయంగా బీజేపీని దెబ్బతీయడంతో పాటు తాను లబ్దిపొందాలని చూస్తోంది. ఇదే బిల్లును తక్షణమే అమలు చేయకుండా జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని కూడా కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఊరించి, ఉసూరుమనిపించేలా ఉందని, భోజనానికి కూర్చోబెట్టి, విస్తరి వేసి రెండ్రోజుల తర్వాత భోజనం పెడతాం అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.
కోవిడ్-19 అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సృష్టించిన పరిణామాల నేపథ్యంలో యావత్ ప్రపంచం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతూ ఉంది. మిగతా ఏ దేశంతో పోల్చినా సరే భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉంది. ధరల నియంత్రణ, ఆహార కొరత లేకుండా చూసుకోవడంలో సమర్థవంతంగా చర్యలు చేపట్టింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే క్రమంలో 10 లక్షల ప్రభుత్వ కొలువుల భర్తీతో పాటు ప్రైవేటు రంగానికి ఊతమిచ్చేలా అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందజేస్తోంది. సామాన్య ప్రజల్లో ఇంత విశ్లేషణ ఉండదు కాబట్టి, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్యను ప్రచారాస్త్రంగా మలచుకుని బీజేపీని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ ఒంటరిగా, నేరుగా బీజేపీని ఢీకొట్టే పరిస్థితి ఉంటే.. ఈ అంశాలపై ముఖాముఖి పోరు ఏర్పడేది. కానీ సుమారు 30 పార్టీలతో కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమిలో సీట్ల సర్దుబాటే సవాలుగా మారనుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా, మోదీని గద్దె దించడమే తమ ఉమ్మడి లక్ష్యం అన్నట్టుగా ఈ 30 పార్టీల వ్యవహారశైలి అంతిమంగా మోదీ పట్ల ప్రజలకు సానుభూతిని కలిగించేటట్టే కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..