Suella Braverman: ప్రొపర్టీ కన్పించడం పాపం.. ఎప్పుడు ఆక్రమించేద్దామా అన్నట్లే ఉంటుంది కొంతమంది ఆలోచనలు.. ఆస్తి ఎవరిదైతే మాకేంటి.. ఏదోలా సొంతం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకుంటారు. చివరికి ప్రముఖుల ఆస్తులను కూడా వదల్లేదు ఓ ప్రబుద్దుడు. బ్రిటన్ హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్ పూర్వీకుల ఆస్తులు భారత్‌లో ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఆమె తండ్రి గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర గోవాలోని అసగావ్ గ్రామంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆస్తులు ఉన్నాయని బ్రావెర్మన్ తండ్రి క్రిస్టీన్ ఫెర్నాండెజ్ తెలిపారు. వీటిలో 13,900 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే రెండు ప్లాట్లను గుర్తుతెలియని వ్యక్తి ఆక్రమించారంటూ గోవా పోలీసులను ఆశ్రయించాడు. ఓ వ్యక్తి పవార్ ఆఫ్ ఆటార్నీ ద్వారా తమ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని ఫిర్యాదు చేశాడు. జులై నెలలోనే సదరు వ్యక్తి ఆస్తులు కబ్జాకు యత్నించగా.. ఆగస్టులో క్రిస్టీన్ ఫెర్నాండెజ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సవాంత్, రాష్ట్ర డీజీపీ జస్పాల్ సింగ్, గోవా ఎన్నారై కమిషనరేట్‌కు ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
క్రిస్టీన్ ఫెర్నాండెజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోవా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారత సంతతికి చెందిన సుయెలా బ్రావెర్మన్ ఇటీవల లిజ్ ట్రస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా నియమితులయ్యారు. తండ్రి క్రిస్టీన్ ఫెర్నాండెజ్, తల్లి ఉమా ఫెర్నాండెజ్ పూర్వీకులు భారత్‌కు చెందినవారు. వీరి కుటుంబాలు భారత్ నుంచి కెన్యాకు వలసవెళ్లి.. ఆ తర్వాత బ్రిటన్‌లో స్థిరపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..