Fire Accident: ఛార్జింగ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం!

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్‌ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో మంటలు చెలరేగి ఇద్దరు యువకులు సజీవదహనం కాగా.. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fire Accident: ఛార్జింగ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం!

Updated on: May 25, 2025 | 4:39 PM

ఎలక్ట్రిక్‌ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు యువకులు సజీవ దహనమైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిని హాస్పిటల్‌కు తరలించారు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..షాహ్దారాలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రిక్‌ ఆటోల ఛార్జింగ్‌ పాయింట్‌ సమీపంలో వాహనాల పార్కింగ్‌ గోడౌన్‌తో పాటు చెరకు రసం యంత్రాలను ఉంచే ఒక షెడ్‌ ఉంది. అయితే ఆదివారం ఉదయం చార్జింగ్‌ పాయింట్‌లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా పక్కనున్న పార్కింగ్‌ షెడ్‌తో పాటు చెరుకు రసం యంత్రాలు ఉంచే షెడ్‌లోకి వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

అయితే ఈ ప్రమాదంలో రాత్రి షెడ్‌లోనే పడుకున్న 19 ఏళ్ల బ్రిజేష్‌తో పాటు 18 ఏళ్ల మణిరామ్ మంటల్లో సజీవ దహనమయ్యారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన యువకులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారు ఎలక్ట్రిక్‌ వాహనాల్లో చెరకు రసం అమ్ముతూ అక్కడి షెడ్‌లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫైర్‌ సేఫ్టీ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్‌ నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..