చత్తీస్‌గఢ్ లోని బీజాపూర్‌లో జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రకర్ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ముఖేశ్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను చత్తీస్‌గడ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ల అవినీతిని వెలుగు లోకి తీసుకొచ్చినందుకే ఈ హత్య జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. రూ. 50 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్‌ను అంచనాలను ఏకంగా రూ.150కు పెంచడంలో జరిగిన అవినీతిని తాజాగా వెలికితీశాడు ముఖేశ్.. దీంతో ఆగ్రహం చెందిన కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్ ఈ హత్యకు స్కెచ్ గీసినట్టు గుర్తించారు.. జర్నలిస్ట్ ముఖేశ్ హత్యపై సిట్ దర్యాప్తుకు చత్తీస్‌గడ్ సర్కార్ ఆదేశించింది.
బీజాపూర్‌కు చెందిన యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 1వ తేదీ రాత్రిన ఇంటి నుంచి అదృశ్యమైన చంద్రకర్.. బీజాపుర్‌లోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంట్లో లో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ముఖేశ్ సోదరుడు యుకేష్ చంద్రకర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. కాంట్రాక్టర్ సురేష్‌కు సంబంధించిన స్థలంలోనే ముఖేష్ చంద్రకర్ మృతదేహం లభ్యం కావడంతో అతడినే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
33 ఏళ్ల ముఖేష్ చంద్రకర్ అనేక వార్తా ఛానెల్స్‌లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌లోని తకల్‌గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో పాత్ర పోషించారు. ‘బస్తర్ జంక్షన్’ పేరిట ముఖేష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
ముఖేశ్ చంద్రకర్ హత్యకు పాల్పడిన కాంట్రాక్టర్‌తో పాటు ఇతరులకు మరణశిక్ష విధించాలని జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. సురేశ్ చంద్రకర్ సెక్యూరిటీని తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ లేదా బదిలీ చేయాలని కోరారు. కాగా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.
“11 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశాం.. నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నాం.. మూడు బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశాం.. ప్రధాన నిందితుడు సురేశ్ చంద్రకర్‌ను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. నాలుగు వారాల్లో దర్యాప్తు పూర్తి చేస్తాం..” అని చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ తెలిపారు.
యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో నేరాలకు, నేరస్థులకు చోటు లేదని, ముఖేష్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్ట్‌ను చంపిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం సాయి అన్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేశ్ చంద్రకర్ అక్రమ నిర్మాణాన్ని పోలీసులు బుల్‌డోజర్లతో కూల్చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి