
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్ధి హత్యపై రాజకీయ రచ్చ రాజుకుంది. ఏంజెల్ చక్మా కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్‌గాంధీ కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్ధులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివక్షకు ఏంజెల్ చక్మా హత్య ఉదాహరణ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు విద్యార్థి హత్య కేసులో ప్రమేయం ఉన్న ఆరో నిందితుడిని పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ పోలీసులు తమ బృందాన్ని నేపాల్‌కు పంపారు.
త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఏంజెల్ చక్మా తన తమ్ముడు మైఖేల్‌తో కలిసి డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాడు. డిసెంబర్ 9న, డెహ్రాడూన్‌లోని సెలక్యూ మార్కెట్‌లో అతనికి 22 ఏళ్ల సూరజ్ ఖవాస్, మరో ఐదుగురితో వాగ్వాదం జరిగింది. ఆరుగురు నిందితులు ఏంజెల్‌పై కత్తులు, ఇత్తడి పిడికిళ్లతో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాల కారణంగా చక్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. డిసెంబర్ 26న చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ నేపాల్‌లోని కంచన్‌పూర్ జిల్లాకు చెందిన యజ్ఞరాజ్ అవస్థి పరారీలో ఉన్నాడు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రతి పౌరుడి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధామి హామీ ఇచ్చారు. అయితే బాధితుడి తండ్రి, బిఎస్‌ఎఫ్‌లో జవాన్‌గా పనిచేస్తున్న తరుణ్ చక్మా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించారు. దాడి చేసినవారు ఏంజెల్‌ను “చైనీస్ మోమో” అని పిలిచారని, అయితే తాను “చైనీస్ కాదని, భారతీయుడినే” అని చెప్పినప్పటికీ వారు వినలేదని ఆయన ఆరోపించారు.
అయితే, పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించి, శాంతిభద్రతలకు భంగం కలిగించి, నేర కార్యకలాపాలకు పాల్పడే అటువంటి నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటంబంతో సీఎం ధామి ఫోన్‌లో స్వయంగా సంప్రదించి, ఓదార్చారు. ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందన్నారు. ఇదిలావుంటే, విద్యార్థి జాతి వివక్షతో హత్య చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కల సంఘం తీవ్రంగా స్పందించింది. డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్‌ఎస్‌పికి ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసు పంపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..