పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. కోల్ కతా లోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను ఆదివారం రాత్రి అడ్మిట్ చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన కారణంగా నుస్రత్ ను ఆస్పత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు. . ఆదివారం తన భర్త, బిజినెస్ మన్ అయిన నిఖిల్ జైన్ బర్త్ డే కావడంతో అందుకు సంబంధించి జరిగిన సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది కూడా. అయితే ఆ తరువాత హఠాత్తుగా శ్వాస తీసుకోలేకపోయిందట. ఏమైనా.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్ఛునని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నుస్రత్ మూడున్నర లక్షల ఓట్లతో విజయం సాధించిన సంగతి విదితమే.. ముస్లిం అయినప్పటికీ హిందూ సంప్రదాయాలను పాటిస్తున్న ఆమెపై పలు ముస్లిం సంఘాలు మండిపడినప్పటికీ, ఆ సంఘాలకు, మత గురువులకు ఆమె దీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.