ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో తన అనారోగ్యానికి గాను ఆయనకు లభిస్తున్న చికిత్స సంతృప్తికరంగా లేదని, ఫలితంగా వ్యాధి తీవ్రత పెరిగి 8 నుంచి 9 కేజీల బరువు తగ్గారని వారు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయనకు చికిత్స చేయాలని తాము కోరుతున్నామని, 2016 లో కూడా ఈ డాక్టరే ఆయనకు ట్రీట్ మెంట్ చేశారని వారు పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి చికిత్స అనంతరం చిదంబరం ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడిందన్నారు. చిద్దూ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.