
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలను చూసి వారు ముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ ఆలయ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టిఫానీ ట్రంప్ సైతం ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు.
ఢిల్లీ పర్యటన తర్వాత టిఫానీ ట్రంప్ శనివారం ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వెళ్తారు. అక్కడ ప్రేమసౌధం తాజ్ మహల్‌ను ఆదివారం ఉదయం ఆమె సందర్శించనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఆమె తాజ్ మహల్ పరిసరాల్లో గడపనున్నారు. ఆగ్రా పర్యటన అనంతరం అక్కడి నుండి నేరుగా రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరమైన జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ఇది పూర్తిగా టిఫనీ ట్రంప్ వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ, ఆమె అమెరికా అధ్యక్షుడి కుమార్తె కావడంతో భారతీయ భద్రతా సంస్థలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ప్రోటోకాల్ ప్రకారం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
A beautiful day of exploring culture and heritage.✨
It was an honor to host Tiffany Trump, Michael Boulos, and their friends at BAPS Swaminarayan Akshardham in New Delhi. 🙏https://t.co/EFKbGtQpuG@TiffanyATrump @USAmbIndia @BAPS https://t.co/5eJEuy6RV1 pic.twitter.com/2FMd6sNYbV
— Swaminarayan Akshardham – New Delhi (@DelhiAkshardham) May 29, 2026