
CBI New Director: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. నూతన డైరెక్టర్ కోసం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నివసాంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన, పార్లమెంట్‌లో విపక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపికకు కసరత్తు చేస్తోంది. అయితే 1984-87 బ్యాచ్‌లకు చెందిన 100 మంది పేర్లను పరిశీలించి, అందులో ముగ్గురితో తుది జాబితాను రూపొందింది కమిటీ. అయితే వీరిలో ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్తీ (1985 బ్యాచ్), సశస్త్ర సీమాబల్ డీజీ కేఆర్ చంద్ర, హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది సీబీఐ కొత్త చీఫ్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని సీబీఐ అత్యున్నత పదవికి ఎంపిక చేయనున్నారు.
కాగా, డైరెక్టర్‌గా ఉన్న ఆర్‌కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో సీబీఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ పదవికి ఎంపికైన వారు రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. నాలుగు నెలల ముందుగానే కమిటీ సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆలస్యమైంది. తాజాగా డైరెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో ఉంది కేంద్రం.