Jackson Moonwalks At Work: ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు తెలియదన్నారు పెద్దలు. ఆమాటను ఆదర్శం తీసుకుని అమలు చేస్తున్నాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇండోర్‌కు చెందిన రంజిత్ సింగ్ తన విధిని నిర్వహిస్తూనే మరోవైపు ప్రయాణీకుల ముఖంలో నవ్వులు పూయిస్తున్నారు. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఫేమస్ స్టెప్స్ “మూన్‌వాక్” చేస్తూ రోడ్డు పై ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంజిత్ సింగ్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ ప్రయాణీకుడు వీడియో చిత్రీకరించి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయారు. అతనితో ఫోటోలు తీసుకునేందుకు స్థానికులు, ప్రయాణీకులు పోటీపడుతున్నారు.
అయితే డ్యాన్సర్ కావాలనుకున్న తాను ఆర్ధిక ఇబ్బందులతో కలను పక్కన పెట్టి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారినట్లు చెప్పారు. అంతేకాదు.. తాను డ్యాన్స్ చేస్తూ టాఫిక్ ని నియంత్రించడానికి కూడా ఓ రీజన్ ఉందని చెప్పారు రంజిత్. 16 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ ను అదుపులోకి తీసుకుని రమ్మనమని పై అధికారి ఆజ్ఞాపించారు. అక్కడకు వెళ్లి చూస్తే మరణించిన వ్యక్తి నా స్నేహితుడు నేను భయంతో రోడ్డుపై అడ్డంగా నృత్యరూపకంగా నడుచుకుంటూ వెళ్లాను. అయితే అక్కడ గుమిగూడిన ప్రజలు నన్ను చూస్తున్నారని ఉన్నతాధికారి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఈ విధంగా డ్యాన్స్ స్టెప్పులతో.. ప్రయాణికులను నవ్విస్తున్నాను’ అని రంజిత్ చెప్పారు. అనేక టీవీ షోలో పాల్గొన్న రంజిత్.. ఉత్తమ ట్రాఫిక్ కంట్రోల్ పోలీసు అవార్డు సైతం అందుకున్నారు.