West Bengal: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. స్నేహం నుంచి అయినా, చిరునవ్వుతో అయినా, గొడవలతో అయినా ప్రేమ చిగురించవచ్చు. అలాంటి ప్రేమ జైలులో ఒకరినొకరు కలిసి స్నేహితులైన ఓ ఇద్దరు ఖైదీలను ఒక్కటి చేసింది. అంతే.. 5 రోజుల పెరోల్ తీసుకుని మరీ ఒక్కటయ్యింది ఆ ఖైదీ జంట. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ప్రేమ పెళ్లితో ఒక్కటైన అబ్దుల్ హసీమ్( అస్సాం), షహ్నారా ఖాతున్(పశ్చిమ బెంగాల్) వేర్వేరు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో ఖైదు అయ్యే వరకు ఒకరికి మరొకరు తెలియదు. అయితే ఆ జైలే వేదికగా వారి మధ్య చిగురించిన స్నేహం.. అనతి కాలంలోనే అది ప్రేమగా మారింది. ఇద్దరూ తమ తమ కుటుంబాలకు కూడా విషయం చెప్పి ఒప్పించడంతో అడ్డంకులు లేకుండా ఒక్కటి అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.
దీంతో 5 రోజుల పెరోల్ తీసుకుని తూర్పు బర్ధమాన్‌లోని మాంటేశ్వర బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో బుధవారం ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఒక ఇంటివారయ్యారు. కాగా, వేర్వేరు హత్య కేసుల్లో అబ్దుల్ హసీమ్ 8 ఏళ్లు, షహ్నారా ఖాతున్ 6 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..