Kashmir Actress: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కశ్మీర్ నటి అమ్రీనా భట్‌ను ఆమె నివాసంలో లష్కర్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. అమ్రీనా మేనల్లుడికి కూడా కాల్పుల్లో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జమ్ము కశ్మీర్‌లోని బుడ్గాంలోని చదూరా ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అమ్రీనాను ఆస్పత్రికి తరలిస్తుండగా.. చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమ్రీనాభట్‌ను కాల్చిచంపింది లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. అమాయకులపై మహిళలను, పిల్లలను కాల్చిచంపడాన్ని ఎవరు కూడా సమర్ధించరని ట్వీట్ చేశారు ఒమర్.
కాగా, కశ్మీర్‌లో వరుసగా సాధారణ పౌరులను టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు. శ్రీనగర్‌లో కానిస్టేబుల్ కాల్చివేత, కశ్మీర్ పండిట్ రాహుల్‌భట్‌ను కాల్చి చంపిన కొద్దిరోజులకే ఈ ఘటన జరిగింది. బధవారం రాత్రి 7.55 గంటల సమయంలో ఇంట్లో ఉన్న అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమించడంతో చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమ్రీనాభట్ చాలా కశ్మీర్ సీరియల్స్‌లో నటించారు. మంచి సింగర్ కూడా. అప్పట్లో టిక్‌టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఆకస్మాత్తుగా ఆమె ఉగ్రవాదులకు ఎందుకు టార్గెట్ అయ్యారో అర్ధం కావడం లేదు.