అదిగో తోక అంటే ఇదిగో పులి అనే నేచర్ మనిషి సొంతం. ఇక ఒక చిన్న పని చేస్తే చాలు డబ్బులు వస్తాయనే పుకారు వినిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..అంటే తాజా సంఘటన సజీవ సాక్షంగా నిలుస్తుంది. మహిళలు పొదుపు ఖాతా తెరిస్తే చాలు ఒకొక్కరికి 8 వేల రూపాయలు వస్తాయని.. అది కూడా సోమవారం లాస్ట్ డే అని తెలిసింది. ఇంకేముందు పోలో మంటూ ఆడవారు పోస్టాఫీసుకు క్యూలు కట్టారు. దీంతో ఆ పోస్టాఫీసులో పని చేస్తున్న సిబ్బంది తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ సంఘటనకు వేదికగా బెంగళూరు మారింది.
బెంగుళూరులో సోమవారం (మే 27) వేలాది మంది మహిళలు పొదుపు ఖాతాలను తెరవడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO)లో క్యూ కట్టారు. ఇలా పొదుపు ఖాతా తెరవడం వలన ఒక్కొక్కరికి 8,000 రూపాయలు లభిస్తాయని.. అది కూడా రాజకీయ పార్టీలు పోస్టాఫీసు ఖాతాల్లోకి 8,000 రూపాయలు బదిలీ చేస్తున్నాయని వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ పుకారు షికారు చేసింది. ఇంకేముందు పోస్టాఫీసులో ఖాతా తెరచేందుకు భారీ సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఘోరంగా మారింది. ఒక్కసారిగా వేలాది మహిళలు రావడంతో ఖాతాను తెరచే ప్రక్రియను సులభతరం చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ అదనపు సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు మొదలైన ఖాతాదారుల రద్దీని నియంత్రించడానికి పోస్టాఫీస్ సిబ్బంది పోలీసుల సహాయాన్ని కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..