Telangana Police Raids in UP: తెలంగాణ పోలీసులు.. యూపీలో రెయిడ్ చేసి క్రిప్టో మోసగాడిని పట్టుకున్నారు. తొమ్మిది కోట్లకు పైగా క్యాష్‌ను స్వాధీనం చేసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని చందోలి జిల్లా మొఘల్‌సరాయ్‌కి చెందిన బడా వ్యాపారవేత్త కొడుకు అభిషేక్ జైన్. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ సహా తెలంగాణలో పలువురికి టోకరా వేశాడు. తక్కువ సమయంలో సొమ్ము రెట్టింపు అవుతుందని ఆశ చూపి, క్రిప్టో ట్రేడింగ్ యాప్ ద్వారా చాలామందిని ముగ్గులోకి దించాడు. అదంతా వట్టి మోసమని తర్వాత తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణ సీసీఎస్ పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు.
కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన అభిషేక్ జైన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిగా గుర్తించారు. మొఘల్‌సరాయ్‌లోని రవి నగర్‌లో అతని ఇంటిపై తెలంగాణ పోలీసులు రెయిడ్ చేశారు. అతని ఇంట్లో తొమ్మిది కోట్ల నగదును గుర్తించారు. ఆ సొమ్ముతో పాటు అతని నుంచి కొన్ని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు కన్నయ్య యాదవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇద్దరు నిందితులను మొఘల్‌సరాయ్ ఎస్పీతో కలిసి తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ యాప్‌తో తెలంగాణలో ఎలా మోసాలకు పాల్పడిందీ సమాచారం రాబట్టారు.
ఇప్పటికే అభిషేక్ జైన్‌పై హైదరాబాద్ మూడు కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌తో తక్కువ టైమ్‌లోనే సొమ్ము రెట్టింపు అవుతుందని ఆశ చూపి, తన ఉచ్చులో పడిన వాళ్లను అతను నిండా ముంచేశాడని హైదరాబాద్ సైబర్ సెల్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అభిషేక్ జైన్‌ను ట్రాక్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని మొఘల్‌సరాయ్ కోర్టులో హాజరుపర్చి, ట్రాన్సిట్ రిమాండ్ తీసుకుని హైదరాబాద్ తీసుకువస్తున్నారని సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..