
Mumbai top cop Param Bir Singh: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. వసూళ్ల కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పరమ్‌బీర్ పిటిషన్‌ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలని సుప్రీంకోర్టు పరమ్‌బీర్‌ను ఆదేశించింది. చెప్పేంత వరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని..రక్షణ కల్పించబోమని స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
అసలు భారత్ లోనే ఉన్నారా ? విదేశాలకు వెళ్లిపోయారా ? చెప్పండి అంటూ పరమ్‌బీర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మీరు ఎక్కడ ఉన్నారో తెలిసే వరకు పిటిషన్‌ను విచారించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్నారని అనుకుంటే అరెస్ట్ నుంచి మీకు రక్షణ దొరికితే భారత్‌కు వస్తారు .. మీ మనస్సులో ఏముందో తెలియదు అంటూ సుప్రీంకోర్టు పరమ్‌బీర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కేసు విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
రూ.15కోట్ల కోసం పరమ్‌బీర్ , మరో ఐదుగురు పోలీసులు తనను వేధించారంటూ ఈ ఏడాది జులైలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు పరమ్‌బీర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
చివరిసారిగా మే నెలలో తన కార్యాలయంలో విధులకు వచ్చిన పరంబీర్.. ఆ తర్వాత నుంచి కనిపించడంలేదు. ఆయన దేశం విడిచి పారిపోయారనే ప్రచారం కూడా జరుగుతోంది. పరమ్‌బీర్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి: Rice in Telangana: బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోం.. ఎందుకో వివరించిన కేంద్రం