ఢిల్లీ, అక్టోబర్ 10: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ మొదలైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నవాదనలు చేస్తున్నారు.
చంద్రబాబుకు నోటీసులు జారీ చేయాలని ముకుల్ రోహత్గీ వాదించగా.. ఆ వాదనలను హరీష్ సాల్వే తోసిపుచ్చారు. దీంతో సుప్రీంకోర్టు విధివిధానాలను ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్ ముందుంచారు. అయితే, వాదనలకు ఎంత సమయం కావాలని హరీష్ సాల్వేను జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రశ్నించగా.. కనీసం గంట కావాలని హరీష్ సాల్వే జవాబు చెప్పారు. గంట సమయం అవసరమైనపుడు ఆ తర్వాతే తాను వస్తానని బెంచ్‌కు ముకుల్ రోహత్గీ తెలిపారు. నోటీసులు ఇస్తారా.. అనే విషయాన్ని బెంచ్ తేల్చాలని ముకుల్ రోహత్గీ కోరారు.
కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు హరీష్ సాల్వే. క్రిమినల్ కేసుల్లో మళ్లీ కౌంటర్ అఫిడవిట్ల అవసరమేంటని హరీష్ సాల్వే వాదించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని.. అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గీ వివరణ ఇచ్చారు. నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించగా.. గతంలో వచ్చిన తీర్పులను బెంచ్ ముందు ఉంచుతానని హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదంటూ రోహత్గీ వాదనలు వినిపించారు. 2014-16 మధ్య కాలంలో స్కిల్ స్కామ్ జరిగిందని.. ఆ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు.
అయితే, 2021 డిసెంబర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మూడు సెక్షన్లు ఐపీసీ ప్రకారం ఏడు సెక్షన్లు నమోదయ్యాయని రోహత్గీ కోర్టుకు తెలిపారు. FIR నమోదు చేసినప్పుడు చంద్రబాబు నిందితుడిగా లేరని.. ఇది రాజకీయ కక్షసాధింపు కాదని స్పష్టమవుతోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం