
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారాకు.. సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగులను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ జామ్‌నగర్‌లోని వంతారాకు ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా వంతారాకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు గుర్తు చేసింది. అలాగే వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సి.ఆర్. జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ అస్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక వంతారాపై సిట్ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత.. ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
వంతారాలో చట్టాలను పాటించట్లేదని.. విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకొస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఆ కమిటీ.. వంతారా అంతర్జాతీయ ప్రమాణాలు, వన్యప్రాణుల సంక్షేమం, ఆర్థిక పారదర్శకత లాంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించింది. అయితే ఇదంతా బయటి దేశాల నుంచి జరుగుతున్న కుట్ర అని, భారత్ చేస్తున్న మంచి పనులపై జంతువుల వేటను అనుమతించే దేశాలు ఈవిధంగా అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయని.. ఈ విషయంలో దర్యాప్తునకు తాము అన్నివిధాలా సిట్‌కు సహకరిస్తామని వంతారా తరఫు న్యాయవాది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
అనంత్ అంబానీ మదిలో పుట్టిన ఆలోచనతో ఏర్పాటైన వంతారా.. రిఫైనరీ కాంప్లెక్స్‌లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో 3వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది సాధారణ జంతు ప్రదర్శనశా తరహాలో కాకుండా జంతువులకు సహజ వాతావరణాన్ని కల్పించేలా శాస్త్రీయంగా రూపొందించారు. రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ పేరుతో 2021 మార్చ్ 10న ఏర్పాటైన వంతారాని సెంట్రల్ జూ అథారిటీ మినీ జూగా గుర్తించింది. వంతారాలో ఎక్కువ భాగం ఏనుగుల కోసం కేటాయించారు. వంతారాలో 200కి పైగా ఏనుగులు, 300 చిరుతలు ఉన్నాయి. వీటితోపాటు పులులు, సింహాలు, జాగ్వార్‌లు ఉన్నాయి. మొసళ్లు, పాములు, తాబేళ్లు సహా 1200 క్షీరదాలు ఉన్నాయి. 300 జింకలు కూడా ఈ జూలో ఉన్నాయి. మొత్తం 43 రకాలకు చెందిన రెండు వేలకు పైగా జంతువులు వంతారాలో ఉన్నాయి. దేశంతో పాటు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రమాదంలో ఉన్న జంతువులను తీసుకొచ్చి వాటికి చికిత్స అందించడంతో పాటు వాటిని సంరక్షించేలా వంతారాలో ఏర్పాట్లు చేశారు. జంతువులను రక్షించడం, పునరావాసం కల్పించడమే తమ లక్ష్యమని.. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని వంతారా టీమ్ స్పష్టం చేసింది. మొత్తానికి అంబాని తనయుడి అభిరుచితో ఏర్పాటైన వంతారాకి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..