దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని మార్కెట్లలో కిలో చక్కెర ధర రూ.65కు చేరడంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. చెరకు దిగుబడి తగ్గడం, ఇథనాల్ తయారీకి చెరకు మళ్లించడం, వ్యాపారుల నిల్వలు, వరుస పండుగలతో పెరిగిన డిమాండ్‌ వంటి కారణాలతో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం స్టాక్ పరిమితులు విధించింది.

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..
Sugar Price

Updated on: Aug 20, 2026 | 11:37 AM

చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు పండుగలు వరుసకట్టాయి. మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లింది. ఈపరిస్థితి కారణమేంటి. దళారుల చేతివాటమా ? చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా ? లేక ఇథనాల్‌కోసం వచ్చిన ఇక్కట్లా ? దేశానికి ఈసుగర్ టెన్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం..

గతేడాది ఆగస్టులో చక్కెర ధర ఎంతుందో తెలుసా.. అక్షరాలా 38 రూపాయలు. అది పండుగ సీజన్ స్టార్ట్ కావడంతో ఆమాత్రమైనా ధర పెరిగింది. కానీ ఈఏడాది. ఏకంగా 65రూపాయలు పెరిగింది. అంటే ఏకంగా 27రూపాయలు పెరిగింది. ఇంకా రిటైల్ గా ఎక్కువగానే అమ్ముతున్నారు. ఇంకా గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి.. వరుసగా వస్తున్నాయి. ఈ సమయంలో చక్కెరకు డిమాండ్ పెరగడం సహజమే. కానీ ఈస్థాయిలో పెరగడమే వినియోగదారుల ఆందోళనకు కారణమైంది. అసలీ కొరతకు కారణాలు చూస్తే..

  • వ్యాపారులు చక్కెరను వెంటనే అమ్మకుండా గోదాముల్లో ఉంచడం
  • అవసరానికి మించి నిల్వ చేసుకోవడం
  • సరిపడా చక్కెర నిల్వలు ఉన్నా, రోజువారీ అమ్మకాలు తగ్గించడం
  • వ్యాపారుల మధ్య సరఫరా నియంత్రణ కొనసాగడం
  • ధర పెరుగుతుందని ముందే ఊహించి పెద్ద ఎత్తున వ్యాపారులు కొనుగోలు చేయడం
  • ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు తరలించకుండా సప్లై చైన్ తగ్గిపోవడం
  • వరుసగా పండుగల సీజన్ రావడం
  • వర్షాభావ పరిస్థితులతో చెరకు దిగుబడి తగ్గిపోవడం
  • ఇథనాల్‌కు కొంత చెరకు మళ్లించడం.

ఇలా పలుకారణాలతో దేశంలో చక్కెరకు కొరత ఏర్పడింది. ఈకొరత కారణంగా ధరలు అమాంతం పెరిగాయి. దేశంలోని ప్రధాన షుగర్ మార్కెట్లలో ఊహించని విధంగా ధరలు పెరిగాయి. పెరుగుతూనే ఉన్నాయి. ఇక వచ్చేనెల నుంచి ఇప్పటికి ఉన్న ధరలకు మరో 10శాతం పెరగవచ్చని నిపుణులు అంచనా కడుతున్నారు. ప్రస్తుతం దేశంలో షుగర్ ధరలు చూస్తే..

  • హోల్‌సేల్ ధర దాదాపు 20 శాతం పెరుగుదల
  • యూపీలో 5శాతం జీఎస్టీతో చక్కెర ధర రూ.5,670కు చేరిక
  • ఢిల్లీలో హోల్‌సేల్ ధర క్వింటాల్‌కు రూ.5,800
  • రెండు నెలల్లో చక్కెర హోల్‌సేల్ ధర 32 శాతం పెరుగుదల
  • కొన్ని మార్కెట్లలో రిటైల్ చక్కెర ధర కిలో రూ.65
  • సెప్టెంబర్‌ 30 నాటికి చక్కెర నిల్వలు 30–33 లక్షల టన్నులకు పడిపోయే అవకాశం
  • దేశీయ చక్కెర దిగుమతులపై ప్రస్తుతం 100 శాతం కస్టమ్స్‌ సుంకం

కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు..

అంటే ఇది కేవలం ఒక రాష్ట్రంలో ఏర్పడిన సమస్య కాదు.. దేశంలోని కీలక మార్కెట్లలో ఒకేసారి సరఫరాపై ఒత్తిడి పెరిగిన పరిస్థితి.అందుకే కేంద్రం ఇప్పుడు నిల్వలపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా చక్కెర వ్యాపారులు ఎంత నిల్వ ఉంచుకోవచ్చనే దానిపై ఆంక్షలు విధించింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర వ్యాపారులపై స్టాక్ పరిమితులు విధించింది. వ్యాపారి వద్ద గరిష్ఠంగా 4 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వకు అనుమతిచ్చింది. 30 రోజుల అవసరానికి మించి చక్కెర నిల్వ చేయడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ధరలు తగ్గకపోవడంతో సెప్టెంబర్ 1 నుంచి స్టాక్ పరిమితులు మరింత కఠినతరం చేసింది. నెలకు 10 టన్నులకు పైగా చక్కెర కొనుగోలు చేసే వ్యాపారులకు 15 రోజుల స్టాక్ పరిమితి.. 15 రోజుల అవసరానికి మించి చక్కెర నిల్వ చేస్తే నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటున్నారు. చక్కెర నిల్వల వివరాలను వ్యాపారులు వారానికోసారి అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులు తెలిపారు. వ్యాపారుల వద్ద ఉన్న చక్కెర నిల్వలపై నేరుగా పర్యవేక్షించనున్నారు.

చక్కెర ధరల పెరుగుదలలో ప్రధానంగా కనిపిస్తున్న కారణం చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించడం. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచింది. 2025 మధ్య నాటికి దేశంలో 499 కేంద్రాల్లో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతోంది. ఏడాదికి సుమారు 1,822 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేసే సామర్థ్యానికి పెరిగింది.

అయితే ఇథనాల్ కోసం చెరకు మళ్లించడం ఒక్కటే జరిగితే.. ప్రభుత్వం మరో మార్గంలో చక్కెర సరఫరాను సర్దుబాటు చేయగలిగేది. కానీ ఈసారి మరో సమస్య కూడా వచ్చింది. అదే చెరకు ఉత్పత్తి తగ్గిపోవడం. కొన్ని ప్రాంతాల్లో చెరకు పంట దిగుబడి తగ్గింది. కొన్ని చోట్ల కొన్ని రకాల వైరస్‌లతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. మరికొన్ని చోట్ల కొన్ని వ్యాధుల కారణంగా చెరకు నుంచి వచ్చే చక్కెర పరిమాణం తగ్గింది.

సో..చక్కెర ధరల పెరుగుదలకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. చెరకు ఎంత పండుతోంది.. అందులో ఎంత చక్కెరగా మారుతోంది. ఎంత ఇథనాల్‌ కోసం వెళ్తోంది.. మిల్లులు, వ్యాపారుల వద్ద ఎంత నిల్వ ఉంది, మార్కెట్లోకి ఎంత సరుకు వస్తోంది, పండుగల సమయంలో ఎంత అవసరం ఉంటుంది, ఈ లెక్కలన్నింటినీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. అవసరమైతే పరిమితంగా దిగుమతులు చేసి మార్కెట్లో సరఫరా పెంచాలి. అదే సమయంలో రైతులు, చక్కెర మిల్లులకు నష్టం కలగకుండా దిగుమతులు, ఎగుమతులు, ఇథనాల్‌ విధానాలను సమతుల్యం చేయాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం దేశ ఇంధన భద్రతకు అవసరమే.. కానీ దాని భారం వంటింటి చక్కెరపై పడకూడదు. చెరకు రైతు నష్టపోకూడదు.. వినియోగదారుడి జేబుకూ చిల్లు పడకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే ఇప్పుడు కేంద్రం ముందున్న అసలు సవాల్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us