రూ.6.35 కోట్లు పెట్టుబడి.. యాప్‌లో రూ. 2 కోట్ల లాభం! చివరకు షాక్..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశించాడు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి చెప్పిన మాటలు నమ్మాడు. తొలుత చిన్న మొత్తాలతో ట్రేడింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత అప్పులు చేసి మరీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతని ఖాతాలో భారీ లాభాలు కనిపించాయి. కానీ డబ్బులు వెనక్కి తీసుకునే సమయానికి అసలు కథ మొదలైంది. విత్‌డ్రా బటన్ నొక్కగానే ఎర్రర్! చివరకు ఫోన్ కూడా ఎత్తలేదు. దీంతో కోట్ల రూపాయల మోసం జరిగిందని ఆరోపిస్తూ ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ ను ఆశ్రయించాడు గుజరాత్‌కు చెందిన ఓ అకౌంటెంట్.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 32 ఏళ్ల మితేష్ పలు సంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. 2021లో స్టాక్ మార్కెట్‌లో తన పొదుపు డబ్బులను పెట్టుబడి పెట్టాలని చూస్తున్న సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన నరేష్ సేవక్‌రమణి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. తొలుత షేర్లు కొనడం, అమ్మడం విషయంలో సహాయం చేస్తానని నరేష్ చెప్పాడు. అదనపు ఫీజులు అవసరం లేదని, ట్రేడింగ్ ద్వారా కమీషన్ కూడా సంపాదించవచ్చని సూచించాడు. తాను అప్పటికే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నానని చెప్పడంతో.. నరేష్ కొన్ని లింకులు పంపి ట్రేడింగ్ గురించి తెలుసుకునేలా చేసాడు.
2024లో భారీ పెట్టుబడులు
మూడేళ్ల పాటు మితేష్ వివిధ మొత్తాల్లో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్ లో అనుభవం సంపాదించాడు. 2024లో మాత్రం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ఈ విషయాన్ని నరేష్‌తో చెప్పగా.. ‘Hello Trades’ అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసినట్లు మితేష్ ఆరోపించాడు. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న తనకు కమిషన్ చెల్లించాలని చెప్పడంతో నరేష్ పంపిన లింక్ ద్వారా మితేష్ Hello Tradesలో ఖాతా తెరిచాడు.
బ్యాంక్ ఖాతాలు.. QR కోడ్లు.. వరుసగా డబ్బులు!
ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ బ్యాంకు ఖాతాల వివరాలు, QR కోడ్లు మితేష్ కు కనిపించాయి. దాంతో Hello Trades తో పాటు Siddhi Vinayak Enterprise, Pacify Infra, Maruti Money, Drishti తదితర పేర్లతో ఉన్న ఖాతాలకు డబ్బులు పంపాడు. తాను చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్లను నరేష్‌కు వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తాను పంపిన డబ్బుకు సమానమైన మొత్తం .. ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో తన ఖాతా బ్యాలెన్స్‌గా కనిపించేదని మితేష్ తెలిపాడు. అంతేకాదు.. నరేష్ సూచన ప్రకారం అతనికి, ఇతర ఖాతాలకు కమీషన్ మొత్తాలను బదిలీ చేసాడు.
రూ.6.35 కోట్లు పెట్టాడు.. రూ.4.23 కోట్లు తిరిగి వచ్చాయి
2024 నుంచి 2026 ఫిబ్రవరి వరకు మితేష్ మొత్తం రూ.6,35,47,843 పెట్టుబడి పెట్టాడు. అందులో రూ.4,23,15,169 తిరిగి తనకు వచ్చినట్లు తెలిపాడు. అంటే మిగిలిన మొత్తాన్ని తిరిగి పొందాల్సి ఉంది. అయితే అప్పటివరకు ప్లాట్‌ఫామ్‌లో కనిపించిన లాభాల లెక్కలు మితేష్‌కు మరింత నమ్మకాన్ని కలిగించాయి. 2026 ఫిబ్రవరి నాటికి తన పెట్టుబడికి అదనంగా దాదాపు రూ.2 కోట్ల లాభం ప్లాట్‌ఫామ్‌లో కనిపించింది. ఇక ఆ డబ్బును బ్యాంక్ ఖాతాలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. మితేష్ ప్లాట్‌ఫామ్‌లో విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకున్నాడు. కానీ.. డబ్బులు రావాల్సింది పోయి.. స్క్రీన్‌పై ఎర్రర్ మెసేజ్ కనిపించింది! తన డబ్బును బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోలేకపోయినట్లు మితేష్ తెలిపాడు. విత్‌డ్రా ఎందుకు కావడం లేదని మితేష్ నరేష్‌ను సంప్రదించాడు. ఒకటి రెండు రోజుల్లో విత్‌డ్రా ఏర్పాటు చేస్తానని నరేష్ చెప్పినప్పటికీ రోజులు గడిచినా డబ్బు మాత్రం రాలేదు. ఆ తర్వాత నరేష్ ఫోన్ కాల్స్‌కు స్పందించడం కూడా ఆపేశాడని మితేష్ ఆరోపించాడు. అప్పుడే తనకు అనుమానం వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మొత్తం నష్టం రూ.4.12 కోట్లు?
మితేష్ ఫిర్యాదు ప్రకారం.. తన పెట్టుబడిలో ఇంకా రూ.2.12 కోట్ల అసలు మొత్తం రావాల్సి ఉంది. దీనికి అదనంగా ప్లాట్‌ఫామ్‌లో చూపించిన సుమారు రూ.2 కోట్ల లాభం కూడా అందలేదు. ఈ రెండింటినీ కలిపితే తనకు రావాల్సిన మొత్తం రూ.4,12,33,655. అంటే.. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, కొంత మొత్తం తిరిగి పొందినప్పటికీ, చివరికి రూ.4.12 కోట్ల మేర నష్టం జరిగింది. దీంతో మితేష్ రాజ్‌కోట్ కు చెందిన ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ను ఆశ్రయించాడు. నరేష్ సేవక్‌రమణితో పాటు డబ్బులు జమ చేసినట్లు చెప్పిన బ్యాంకు ఖాతాల హోల్డర్ల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు ఆధారంగా EOW అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? ప్రస్తుతం దర్యాప్తులో కీలకంగా మారిన ప్రశ్న ఇదే. మితేష్ పంపిన డబ్బులు ఏ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయి? ఆ ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? Hello Trades ప్లాట్‌ఫామ్ వెనుక ఎవరున్నారు? దర్యాప్తులో కోట్ల రూపాయల లావాదేవీల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.