Strain Virus: ఒక వైపు కరోనా మహమ్మారి .. మరోవైపు కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా నుంచి బయటపడకముందే .. కొత్త కరోనా వైరస్ కేసులు దేశంలో క్రమ క్రమంగా వ్యాపిస్తున్నాయి. యూకేలో మొదలైన ఈ స్ట్రెయిన్ వైరస్ ఇతర దేశాలకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇక భారత్‌లో కొత్త రకం కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. తాజాగా భారత్‌లో స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటి వరకు 109 ఉండగా, తాజాగా నమోదైన స్ట్రెయిన్ కేసులతో 114కు చేరింది.
బ్రిటన్‌లో ఈ రకం వైరస్ వెలుగు చూసిన వెంటనే భారత్ అప్రమత్తమైంది. ఆ దేశానికి కొద్ది రోజుల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆ తర్వాత జనవరి 8 నుంచి తిరిగి విమాన సేవలు ప్రారంభించినప్పటికీ, యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్ లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కరోనా పాజిటివ్ తేలిన వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 114 మందికి స్ట్రెయిన్ సోకగా, ప్రస్తుతం వారంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇక వారితో కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించే పనిలో ఉంది కేంద్రం.
ఈ స్ట్రెయిన్ వైరస్ విషయంలో రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నామని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. దీనిపై పర్యవేక్షణ, పరీక్షలు చేయడం, శాంపిళ్లను ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సోర్టియం ల్యాబ్‌లకు పంపడంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని వివరించింది.
కాగా, ఈ యూకే స్ట్రెయిన్ వైరస్ భారత్‌తో పాటు జపాన్, కెనడా, జర్మనీ, బెబనాన్, సింగపూర్, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్‌లకు కూడా వ్యాపించింది. సాధారణ కరోనా వైరస్ కంటే త్వరితంగా వ్యాప్తి చెందే ఈ యూకే స్ట్రెయిన్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచిస్తోంది