చైనా సమస్యపై బీజేపీకే తమ సపోర్ట్ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఎంతో ఆందోళనకరమన్నారు. భారత-చైనా బోర్డర్ సమస్యపై మేం కమలం పార్టీకి మద్దతునిస్తున్నాం..అయితే ఇది, కాంగ్రెస్ రెండూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం సరికాదు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకోవచ్ఛునన్నారు. మీలో మీరు ఇలా వాదులాడుకోవడం వల్ల ఇతర సమస్యలను, ఈ దేశ ప్రజలను విస్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో పరస్పర ఆరోపణలు మాని, దేశ భద్రతపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. వలస కార్మికుల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆమె విమర్శించారు. తమ పార్టీ ఏ పార్టీ చేతిలోనూ కీలుబొమ్మ కాదని, ఇది జాతీయ స్థాయిలో ఏర్పడిన పార్టీ అని మాయావతి పేర్కొన్నారు.